శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (20:02 IST)

సభను నడపాల్సింది స్పీకరా? ముఖ్యమంత్రా?.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక‌ట్రావు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారు చెప్పిన దానికి చేసేదానికి ఎక్కడ పొంతన ఉండటం లేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నారో మంగళవారం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలంత చూశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు.

గుంటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు 45ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ల ఇస్తామన్న జగన్మోహన్‌రెడ్డి హామీని నెరవేర్చమని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడుని బలవంతంగా సభ నుంచి సస్పెండ్‌ చేయడం బాధాకరమని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనుమతి మేరకు టీడీపీ సభ్యుల్ని స్పీకర్‌ సస్పెండ్‌ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కన్నుసన్నలో సభ నడవడం ఏమిటని ప్రశ్నించారు. 1989లో అసెంబ్లీలో కుర్చీలు ఎక్కి నిలబడేవారని.. అటువంటిది ఈ రోజు కనీసం పోడియం దగ్గరకు కూడా వెళ్లకుండానే ఎమ్మెల్యేలను ఏవిధంగా సభ నుంచి సస్పెండ్‌ చేస్తారని కళా ప్రశ్నించారు.

టీడీపీ సభ్యుల సప్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజలు తరుపున ప్రశ్నించే హక్కు ఉంటుందని అన్నారు. అసెంబ్లీలో వైకాపా నాయకులు చేస్తున్న చేష్టలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారే సరైన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు.