శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:36 IST)

కన్నుల పండువగా శ్రీ గంగా దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలాకల్యాణోత్సవం

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ గంగా దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలాకల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమము నందు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు దంపతుల వారు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణం జరిపించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు  లింగంగుంట్ల దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
 
దేవస్థానము నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నదని  ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎం.వి.సురేష్ బాబు తెలిపారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు నిత్య ఆర్జిత సేవలయందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవి.

భక్తుల సౌకర్యార్థము  దేవస్థానము నందు జరుగు చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామములతో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది.

కావున ఈ పరోక్ష చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా  జరిపించుకోనదలచిన  భక్తులు టిక్కెట్లు  online నందు www.kanakadurgamma.org  – website  ద్వారా పొందవచ్చునని  ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపియున్నారు.

దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు మరియు ఇతరులకు ఆహారం అందించాలన్న ఉద్దేశముతో దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగము ద్వారా ప్రతి రోజు కదంబం మరియు దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లు సురక్షిత వాతావరణంలో తయారు చేసిన అనంతరం ప్యాకింగ్ చేయబడి వీఎంసీ వారి ద్వారా పంపిణీ చేయుట జరుగుచున్నది.

దేవస్థానం వారు జరుపు అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org  ద్వారా,  లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి వారు తెలిపారు.