శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:27 IST)

అభ్యర్థులు స్వప్రయోజనాల కోసం ప్రచారం చేయడం ఉల్లంఘనే: ఏపీ ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో స్వయం సేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం, స్వప్రయోజనాలకై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం.రమేష్ కుమార్ అన్నారు. 
 
ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు. 
 
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. 
 
ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియచేస్తున్నామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.

కావున అటువంటి సంఘటనపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. 
 
సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ వారి లేఖలో పేర్కొన్నారు.