శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (15:56 IST)

ఆంధ్రా ఎస్ఈసీకి పూర్తి భద్రత కల్పిస్తాం: మంత్రి కిషన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రమేష్‌ కుమార్‌ లేఖ వ్యవహారంపై స్పందించారు.
 
'రమేశ్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చింది. లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు. లేఖ ఆయన రాసినట్లుగానే భావిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంటర్నల్‌ విషయం కానీ.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా విధి నిర్వహణలో ఉన్నప్పుడు భయపెట్టడం మంచిది కాదు. అధికారులను బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు. 
 
ఏపీ సీఎస్‌తో హోంశాఖ కార్యదర్శి మాట్లాడి రక్షణ కల్పించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం రమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయనకు తగిన భద్రత ఉంది. కేంద్రం ఆదేశాల మేరకే సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఏర్పాటు చేశారు. రమేష్‌ కుమార్‌ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినా పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం. అవసరమైతే శుక్రవారం లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తాం' అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.