ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో గురువారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది.
కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ బుధవారం తమ విడిది కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై చేపట్టిన చర్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది.