శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (14:45 IST)

అక్రమాలకు అడ్డాగా మంగళగిరి... రంగు సంచులతో బియ్యం మాయ

రాజధాని పట్టణ వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న మంగళగిరి అక్రమాలకు అడ్డాగా మారుతోంది. బహిరంగంగా వినియోగదారుల నడ్డి విరిచి దోచుకుంటున్నా సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదు. కొందరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని ఎక్కువసార్లు పాలిష్‌ చేసి సన్న బియ్యంగా మార్చి రంగుల సంచుల్లో నింపి విక్రయిస్తున్నా పౌరసరఫరా, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఆహార నియంత్రణ శాఖలు అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు.
 
అధికారుల సమాచారం ప్రకారం జిల్లాలోనే హోలోగ్రామ్‌ ఉన్న బియ్యం బ్రాండ్‌ ఒక్కటి కూడా లేదు. హోలోగ్రామ్‌ లేకుండా బ్రాండ్‌ రిజిస్టర్‌ అయినవి లేవు. మార్కెట్‌లో మాత్రం వివిధ రకాల పేర్లతో కొన్ని వందల బ్రాండ్లు పుట్టుకొస్తున్నాయి. హోలోగ్రామ్‌ అంటే నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరకును విక్రయించాల్సి ఉంటుంది. ప్రమాణాల ఉల్లంఘన జరిగితే కేసు నమోదు చేసే అవకాశముంది. 
 
రిజిస్ట్రేషన్‌, హోలోగ్రామ్‌ లేని వారు రకరకాల పేర్లతో సంచులు తయారు చేసుకుని ఏదో ఒక రకం బియ్యాన్ని అధిక ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. ఆకర్షణీయ సంచులతో అందినంత దండుకుంటున్నారు. మంగళగిరి పట్టణంలో గత నాలుగైదేళ్ళ కిందట వరకు నాలుగైదు రైస్ దుకాణాలే ఉండేవి. 
 
దొడ్డుబియ్యం వ్యాపారం విస్తృతమవడంతో కాలక్రమేణా పదుల సంఖ్యలో వెలిశాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం గడించే వ్యాపారం కావడంతో పలువురు వ్యాపారులు, మిల్లర్లు కలిసి దందాకు తెరలేపారు. దీంతో నిజాయతీగా విక్రయించే కొందరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
ఇష్టారాజ్యంగా... 
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ ఉండే బియ్యాన్ని కిలో రూ.30 మించి బహిరంగ మార్కెట్లో విక్రయించకూడదు. ఇది మచ్చుకైనా అమలవడం లేదు. రకరకాల పేర్లు పెట్టుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ధరలు నిర్ణయించుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఓ పేరు మోసిన బ్రాండ్‌ కిలో బియ్యాన్ని రూ.60లకు అమ్ముతుంటే ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేని మరికొంతమంది బ్రాండ్‌ అమ్మకందారులు కిలో బియ్యం రూ.50 తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. 
 
25 కిలోల బియ్యం రూ.1300ల నుంచి రూ.1500ల వరకు పలుకుతోంది. పంట పండించే రైతు నుంచి 25 కిలోల ధాన్యం బస్తాను రూ.900లకు మించి కొనుగోలు చేయని వ్యాపారులు వారు తయారు చేసే బియ్యం విషయంలో మాత్రం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించుకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
 
అధికారులు ఏం చేస్తున్నట్లు..!
గింజ పరిమాణం ఎలా కావాలంటే అలా తయారు చేసే ఆధునిక యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రూ.కోటి నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే యంత్రాలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు బియ్యం విక్రయాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ముడి బియ్యాన్ని ఎలా కావాలంటే అలా మలచుకునే వెసులుబాటు వీటికుంది. పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు వీరి అక్రమాలపై దృష్టి సారించకపోవడంతో బియ్యం మాఫియా ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ఏనాడు తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవు.
 
రంగుల సంచులకు అడ్డాలు
మిల్లులు, గోడౌన్లు రంగు సంచులకు అడ్డాలుగా మారుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో సంచులను మిల్లులో నిల్వ చేసుకుని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి వీటిలో నింపుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని పలుమార్లు పాలిషింగ్‌ చేసి సన్నబియ్యంగా నమ్మిస్తున్నారు. ఇటీవల కాలంలో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాలశాఖ రాష్ట్ర విభాగం కఠినంగా వ్యవహరిస్తుండటంతో పలువురు ఈ దందాకు తెరలేపారు. 
 
వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో ఉన్న సంచులు వందల సంఖ్యలో మిల్లుల్లో కనిపించడం విశేషం. ఇక వారికున్న రైస్‌డిపోలతో బేరం కుదుర్చుకుని సదరు బియ్యాన్ని బ్రాండ్ల రూపంలో మార్కెట్ లోకి వదులుతున్నారు. ఇదేంటని ఓ రైస్‌ వ్యాపారిని  ప్రశ్నించగా లోకల్‌ బ్రాండ్లను లోకల్‌ బ్రాండ్లని చెబుతున్నామని, అసలు బ్రాండ్లు అసలు బ్రాండ్లని చెబుతున్నామని చెప్పుకొచ్చారు.
 
లక్షల్లో పన్నుల ఎగవేత
ఇదిలా ఉంటే  ఎక్కడెక్కడ నుంచో బియ్యం దిగుమతి చేసుకునే వ్యాపారులు ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. రాత్రిళ్లు వే బిల్లులేని వాహనాలతో బియ్యం రవాణా చేస్తున్నారు. తెల్లవారేసరికి దుకాణంలో నింపేసి విక్రయాలు సాగిస్తున్నారు.  మంగళగిరి పట్టణంలో ప్రతి నెల  వేలాది క్వింటాళ్ల వరకు బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో సగం వరకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నావే కాగా ప్రతి నెల రూ.లక్షల్లో పన్ను ఎగవేస్తున్నారు.