శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (15:25 IST)

సుప్రీంకోర్టులో వైకాపాకు వరుస ఎదురుదెబ్బలు... పిన్నెల్లికి సుప్రీం షాక్

supreme court
ఏపీలోని అధికార వైకాపాకు సుప్రీంకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ పార్టీతో పాటు.. ఆ పార్టీ నేతలు దాఖలు చేసుకున్న పిటిషన్లను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్వర్వులపై వైకాపా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పార్టీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
కాగా, పోస్టల్‌ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13ఏ పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. 
 
ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై విచారించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్‌ 1న తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్‌కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 
 
ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై విశాఖ తూర్పు తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు కోర్టు తన వాదనలు కూడా వినాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్‌ ఫైల్‌ చేశారు.
 
పిన్నెల్లికి సుప్రీం షాక్‌.. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
వైకాపా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
 
చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత 
మరోవైపు, చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయాన్ని మరోసారి పరిశీలించాలని.. నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆయన పిటిషన్‌ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిలో జోక్యం చేసుకునేందుకు కారణాలేమీ కనిపించట్లేదని పేర్కొంది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్ ఈ దాఖలు చేసిన విషయం తెల్సిందే.