చెన్నై ప్రజల దాహార్తిని తీర్చండి... సీఎం జగన్ ఆదేశం
తాగు నీటి కోసం అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళనాడు మంత్రుల బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. తాగడానికి నీళ్లు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
చెన్నైలో నీటి కష్టాలను సీఎంకు తమిళనాడు మంత్రుల బృందం వివరించింది. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్.జగన్ వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించిటనట్టు సమాచారం.
ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని, ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలనీ, అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆయన అధికారులను ఆదేశించారు.
చెన్నైకి తాగునీటి జలాలు ఇస్తన్నందుకు తమిళనాడు మంత్రుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. చెన్నైలోని 90 లక్షల మంది ప్రజల ఆశీస్సులు సీఎం వైయస్.జగన్‌కు ఉంటాయన్న తమిళనాడు మంత్రుల బృందం... తాము అడగ్గానే మానవత్వంతో స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
కాగా, సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రుల బృందంలో తమిళనాడు మున్సిపల్ శాఖమంత్రి వేలుమణి, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖమంత్రి జయకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ మనివాసన్ తదితరులు ఉన్నారు.