శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (10:30 IST)

ఆ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాల మూసివేత!

tasmac shop
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 500 మద్యం దుకాణాలను మూసివేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ బుధవారం అధికారిక ప్రకటన విడుదలచేసింది. తొలి విడతలో పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చర్యల్లో భాగంగా, ఈ మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే, గత ఎన్నికల ప్రచారంలో కూడా డీఎంకే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధ హామీని ఇచ్చింది. ఇందులోభాగంగా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ల తర్వాత 500 మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31వ తేదీ నాటికి 5329 రిటైల్ మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో 500 దుకాణాలను మూసివేస్తున్నట్టు ఏప్రిల్ 12వ తేదీన ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఏప్రిల్ 20వ తేదీన జీవో జారీ చేశారు. ఈ జీవో ఆధారంగా 500 టాస్మాక్ దుకాణాలను గుర్తించి జూన్ 22వ తేదీ నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించారు.