మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2023 (09:49 IST)

"బాబు ష్యూరిటీ... భవిష్యత్‌కు గ్యారెంటీ" - 5 నుంచి చంద్రబాబు సీమ పర్యటన

chandrababu
బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 45 రోజుల పాటు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 5వ తేదీ బుధవారం ఆయన తన పర్యటనను రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభిస్తారు. తొలుత అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ఆయన పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బళ్లారి చేరుకుంటారు. అక్కడ తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 
 
ఆ తర్వాత 5, 6, 7 తేదీల్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చర్చా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన రోడ్‌షోలు, సభల్లో ప్రసంగిస్తారు. అలాగే, 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తారని టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లో సాగుతుంది. దీంతో చంద్రబాబు రాయలసీమ జిల్లాల నుంచి తన యాత్రను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. 
 
వైకాపా సర్కారులో దళితులకు కుర్చీలు వేయరు...
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం దళిత ఓటర్లు. అలాంటి దళితులకు ఇపుడు ఏపీలో కనీస మర్యాద కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. వైకాపా నేతలు దొరల తరహాలో నడుచుకుంటున్నారు. వారి కాళ్ల ముందు దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలు కూర్చోవాల్సిందే. తాజాగా దివంగత మాజీ డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు మనవరాలికి ఇదే తరహా అవమానం జరిగింది. తాను కుర్చీలో కూర్చొని ఆమెను ఇంటి మెట్లపై కూర్చోబెట్టారు సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైకాపా నేతలు దొరల్లా వ్యవహరిస్తూ, దళితులను చిన్నచూపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
దివంగత కాంగ్రెస్ దళిత నేత, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు మనవరాలైన డాక్టర్ కోనేరు సత్యప్రియ అవమానానికి గురయ్యారు. తిరువూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న సత్యప్రియ నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆ సమయంలో ఆమె ఇంటిలోపలి మెట్లపై కూర్చొని ఉండగా సుబ్బారెడ్డి కుర్చీలో కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. 
 
దళితులకు వైసీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్న ప్రశ్నతో ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంటికి వచ్చిన దళిత నాయకురాలికి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించడం ఏమిటని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ కోనేరు సత్య ప్రియ, రంగారావు పెద్ద కుమారుడు రమేశ్ కుమార్తె. ఈమె తండ్రి గన్నవరం నియోజకవర్గంలోని గూడవల్లి సర్పంచిగా చేశారు. తాత కోనేరు రంగారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. అంతటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన విద్యావంతురాలైన దళిత మహిళకు వైఎస్ తోడల్లుడు ఇంటిలోనే అవమానం జరగడం చర్చనీయాంశమైంది.