ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 4 మార్చి 2017 (07:09 IST)

మూడేళ్ల కసి తీర్చుకుంటామని బెదిరిస్తున్న టీడీపీ తమ్ముళ్లు : తలపట్టుకున్న చంద్రబాబు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ముఖ్య నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఓటర్లు జారిపోకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మంత్రులకు అప్పగించడంతో మూడేళ్లుగా వారి మీదున్న

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ముఖ్య నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఓటర్లు జారిపోకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు,  మంత్రులకు అప్పగించడంతో మూడేళ్లుగా వారి మీదున్న కసి, కోపం, అసంతృప్తి మొత్తం తీర్చుకునే పనిలో పడ్డారు. బహిరంగంగా ప్రతిపక్ష అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి వైపు వెళితే కక్ష సాధింపు చర్యలకు ఒడిగడతారనే భయంతో క్యాంపులోనే ఉంటూ టీడీపీ అభ్యర్థిని కుమ్మేసే వ్యూహానికి తెర లేపారు.
జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  844 స్థానాలకు గాను వైఎస్సార్‌ సీపీ సుమారు 450 స్థానాల్లో గెలిచింది. వీరికి తోడు అదనంగా ఏడు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు ఎమెల్యే పాశం సునీల్‌ కుమార్, నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో పాటు పలువురు జెడ్‌పీసీటీ, ఎంపీసీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను టీడీపీ ముఖ్య నేతలు బెదిరించో, ప్రలోభ పెట్టో తమ పార్టీలోకి ఫిరాయింపు చేసుకున్నారు. పార్టీ ఫిరాయించిన నేతల బలంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలవచ్చని అంచనా వేశారు. అయితే ఎన్నిక దగ్గర పడిన కొద్దీ టీడీపీ సీన్‌ సితార్‌ అవుతూ వస్తోంది. వైఎస్సార్‌సీపీ పోటీకి దిగితే బాగుంటుందని అనేక మంది టీడీపీ ఓటర్లు ఆశించినట్లుగా ఆ పార్టీ తన అభ్యర్థిని పోటీకి నిలిపింది. అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై తమ నుంచి వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధులను మళ్లీ తిరిగి రావాలని పిలుపునిచ్చింది. టీడీపీలో చేరి తప్పు చేశామని బాధపడుతున్న అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థికి ఓటేసి తమ తప్పు దిద్దుకునేందుకు సిద్ధమయ్యారు.
 
జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఎంపీటీసీ, జెడ్‌పీసీటీ సభ్యులు, కౌన్సిలర్, కార్పొరేటర్లకు విలువ లేకుండా చేశారు. వలస నాయకులకు ఎనలేని ప్రాధాన్యం, గౌవరం ఇస్తూ పార్టీనే నమ్ముకున్న వారిని పూచిక పుల్లలా తీసి పారేస్తున్నారని టీడీపీ నుంచి గెలుపొందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా కాలంగా రగిలిపోతున్నారు. దీనికి తోడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేలు లేదా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు తమ వ్యక్తిగత గ్రూపులు తయారు చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
నియోజకవర్గంలో రూపాయి పని జరిగినా తాము చెప్పిన వారికో తమను గమనించుకునే వారికో తమకు బాగా దగ్గరైన వారికో మాత్రమే ఇస్తున్నారు. నెల్లూరు, వెంకటగిరి, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల్లో పార్టీ ముఖ్య నేతలకు మండల స్థాయి నేతలకు మధ్య తీవ్ర విభేదాలు రగులుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల మీద తిరుగుబాటు చేయడానికి ఈ ఎన్నికల సమయమే సరైందని అనేక మంది నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తొలుత కోవూరు నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీ సభ్యులు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఇందుకూరుపేట ఎంపీపీ, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు.
 
ఈ సంఘటనతో ఖంగుతిన్న అధికార పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. ఉన్న వారిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నా, కొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మరికొంత మంది జెండా ఎత్తేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సందర్భంలో సూళ్లూరుపేట నియోజక వర్గంలో కూడా టీడీపీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నాయుడుపేట కౌన్సిలర్‌ రమణమ్మ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఈ సెగ పెరిగే ప్రమాదం ఉందని మంత్రులు, పార్టీ పెద్దలతో పాటు అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి ఆందోళన చెందుతున్నారు.
 
కోవూరు నియోజకవర్గంలో బహిర్గతమైన తిరుగు బాట్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ పెద్దలు తమ వద్ద ఉన్న ఓటర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. అనుమానం ఉన్న వారిని బెదిరించడం, బుజ్జగించడం, డబ్బులు ఎరవేయడం లాంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. ఓటర్లను శిబిరా లకు తరలించారు. వీరి ఒత్తిడి తట్టుకోలేని అనేక మంది శిబిరాలకు వెళ్లినా ఓటు మాత్రం వైఎస్సార్‌సీపీకి వేసేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే తాము శిబిరాలకు వచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితులు టీడీపీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
 
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి అవసరమైన ఓటర్ల బలం ఉన్నా పరిస్థితులు తారు మారు అవుతుండటంపై సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పార్టీ నేతల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మంత్రులు శిద్ధా రాఘవరావు, నారాయణతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి మరింత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తీసుకు వస్తామని చెప్పారనీ, ఇప్పుడు పరిస్థితి రివర్స్‌లో ఉందని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. స్థానిక సంస్థలతో పాటు  పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు కూడా గెలవకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను సైతం వదిలేసి ఓటర్లు జారిపోకుండా చూసుకునే పనిలో ఉండాలని భావిస్తున్నారు. తాజా పరిస్థితులపై గురువారం రాత్రి టీడీపీ జిల్లా ముఖ్య నేతలు సమీక్షించుకున్నారు.