ఏపీలో కరోనా విజృంభణ.. టీడీపీ సీనియర్ నేత నరసింహారావు మృతి
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నడకుదిటి నరసింహారావు కరోనాతో మృతిచెందారు. గత కొంతకాలం క్రితం కరోనా బారిన పడిన ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు నరసింహారావు.. మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కింది. ఇక, ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మామ కూడా.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారు. ఆయన కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. నరసింహారావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. సంతాపం వ్యక్తం చేశారు.
మరోవైపు ఏపీలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 31,809 మందికి పరీక్షలు చేశారు. అయితే ఈ ఫలితాల్లో 1,271 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున కరోనాతో మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 7,220కి మృతుల సంఖ్య చేరింది.