బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (11:17 IST)

విశాఖలో మరో పది బీచ్‌లు ఏర్పాటు

విశాఖలో మరో పది కొత్త బీచ్‌లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస‌రావు తెలిపారు. విశాఖ పోర్టు సాయంతో తొలి దశలో ఐదు అభివృద్ధి చేస్తున్నామ‌ని, ఒక్కో బీచ్‌లో రూ.2.50 కోట్లతో సదుపాయాలు కల్పిస్తామ‌న్నారు. ఏపీటీడీసీ చేసిన ఈ  ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం ఇచ్చింద‌ని మంత్రి చెప్పారు. 
 
విశాఖలోని రుషికొండ-భోగాపురం మధ్య మరో పది బీచ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఒక్కో బీచ్‌ను రూ.2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది. విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలిదశలో ఐదు బీచ్‌లను సిద్ధం చేయనున్నారు. రెండోదశలో మిగతావి అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే ఆర్కేబీచ్, రుషికొండ, యారాడ బీచ్‌లు ఉన్నాయి.

విశాఖపట్నం నుంచి భీమునిపట్నం మీదుగా భోగాపురం వరకు ఆరు వరుసల రహదారి అభివృద్ధిలో భాగంగా తీరం వెంబడి కొత్త బీచ్‌లు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఇందులో భాగంగా తీర ప్రాంత నియంత్రణ జోన్‌ నిబంధనలకు లోబడి ఆయా బీచ్‌ల్లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయాలు కల్పించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చెప్పారు. 
 
కొత్త బీచ్‌లు ఇవే...
1. సాగర్‌నగర్, 2. తిమ్మాపురం, 3. మంగమూరిపేట, 4. చేపలుప్పాడ, 5. ఐఎన్‌ఎస్‌ కళింగ, 6. ఎర్రమట్టి దిబ్బలు, 7. భీమునిపట్నం, 8. నాగాయంపాలెం, 9. అన్నవరం, 10. కంచేరుపాలెం
 
బీచ్‌ల‌లో కల్పించే సదుపాయాలు...
ఫుడ్‌ కోర్టులు, పిల్లల క్రీడా పార్కులు. నడక మార్గాలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరికరాలు, స్నానాల గదులు, తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్‌ జోన్లు, బీచ్‌ క్రీడలు, వాచ్‌ టవర్, సీసీ టీవీ కంట్రోల్‌ రూం, ప్రాథమిక వైద్యం.
 
విశాఖ-భోగాపురం తీర ప్రాంతం పొడవునా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్, బుద్ధిస్టు పర్యాటకాన్ని పెంచడం, రీక్రియేషన్‌ టూరిజం కోసం ఉల్లాస పార్కులు, స్కైటవర్, టన్నెల్‌ అక్వేరియం వంటివి అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత విలాసవంతమైన హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు.