బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (09:53 IST)

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యాడనీ.. ఓ వ్యక్తిపై కేసు నమోదు.. ఎక్కడ?

పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఓ కరోనా పాజిటివ్ బాధితుడిపై కేసు నమోదైంది. అలాగే, అతనికి సహకరించిన తండ్రి, ఓ లారీ డ్రైవర్, లారీ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెనాలి పట్టణంలోని ఐతా నగర్‌కు చెందిన 23 సంవత్సరాల యువకుడు చెన్నైలోని ఒక హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తూ ఓ హాస్టల్‌లో నివసిస్తున్నాడు. 
 
అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా హోటల్ మూతపడింది. దీంతో ఆ యువకుడు తన హాస్టల్ గదికే పరిమితమయ్యాడు. పైగా సొంతూరుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మిన్నకుండిపోయారు.
 
ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు తెనాలి నుంచి ఓ లారీ వెళ్లగా, లారీ డ్రైవర్ ఫోన్ నంబరును తన కుమారుడికి ఇచ్చిన అతని తండ్రి, దానిలోనే తెనాలికి రప్పించాడు.
 
ఈ లారీ నాలుగున తెనాలికి చేరుకోగా, విషయం తెలుసుకున్న వలంటీర్లు, తొలుత ట్రూనాట్ విధానంలో అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. ఆపై గుంటూరులో మరోమారు పరీక్షలు చేయించగా, కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 
 
ఈ విషయం హెల్త్ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం సాగించడంతో పాటు, పట్టణానికి వైరస్‌ను తీసుకువచ్చారన్న కారణంతో నలుగురిపైనా కేసు పెట్టామని అన్నారు. కాగా, చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వ్యాప్తికి అతిపెద్ద కేంద్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.