గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (07:05 IST)

మూడుదశాబ్దాల తరువాత బిడ్డల చెంతకు తల్లి.. కడప జిల్లాలో అపురూప దృశ్యం

మూడుదశాబ్దాల క్రితం ఇంటిని వీడిన ఆ తల్లి ఎట్టకేలకు బిడ్డల చెంతకు చేరింది. కన్నపేగు బంధం కళ్లముందు కదలాడుతుంటే మైమరిచిపోయింది. కుమారుడు, కుమార్తెలు, మనవళ్లను చూసి ఆనందంతో మురిసిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన ఆంజనేయులు, పద్మావతికి 1962లో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఆంజనేయులు జమ్మలమడుగు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు.

1987లో భర్తతోహొమనస్పర్థలు వచ్చి పద్మావతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఎవరికీ కనిపించకుండా పోయిన ఆమె రాజమహేంద్రవరం లాలాచెరువులో ఓ చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగించింది. వయసు మీద పడుతున్న కొద్దీ తన కుటుంబాన్ని చూడాలని ఆమెకు అనిపించింది.
 
రాజమహేంద్రవరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ గతంలో ఓ కేసు నిమిత్తం లాలాచెరువుకు వచ్చినపుడు పద్మావతిని గమనించారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుటుంబాన్ని చూడాలని ఉందని ఆమె సూర్యనారాయణకు తెలిపింది.

దాంతో గత ఏడాది ఆమె ఫొటో, వివరాలు ఫేస్‌బుక్‌లో పెట్టారాయన. అప్పట్లో ఈ విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలియరాలేదు. మూడు రోజుల క్రితం ఆమె కుమారుడి దృష్టికి వచ్చింది. వెంటనే బంధువులతో కలిసి పద్మావతి ఉంటున్న చోటుకు వెళ్లాడు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.

దాదాపు 32 ఏళ్ల తరువాత ఆమె ఇంటికి రావటంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. పద్మావతి ఇంటి నుండి వెళ్లిపోయిన నాటి నుంచి చాలా చోట్ల ఆమెకోసం వెతికామని, ఒక దశలో ఆమె చనిపోయిందని భావించామని కుటుంబసభ్యులు అంటున్నారు.

కానీ ఫేస్‌బుక్‌ సహాయంతో కానిస్టేబుల్‌ మమ్మల్ని కలిపారని వివరించారు. ఆమె ఇంటికి చేరటంతో తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇన్నేళ్ల తరువాత ఇంటికి చేరినందుకు పద్మావతి ఎంతగానో సంతోషిస్తున్నారు.