భక్తులకు శ్రీవారి దర్శనం.. మాస్కులు, భౌతిక దూరంతో అనుమతి..
కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనాన్ని భక్తులు నోచుకోలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు తప్పించి భక్తులకు అనుమతి లేదు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారబోతోంది. భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లభించనుంది. త్వరలో భక్తులను అనుమతించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి దర్శనానికి భక్తులను అనుమతించాలనుకుంటోంది. దీనిపై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
కరోనా కట్టడి నిర్మూలను మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి ముఖ్య చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చిన టీటీడీ దర్శన విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీ సిద్ధం అవుతోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి వుండే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకనున్నట్లు సమాచారం.
టైం స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనుంది. ట్రయిల్ కింద స్థానికులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ అయితే ఈ విధానం కొనసాగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.