శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (12:29 IST)

సీఎస్‌గా 3- 4 నెలలే ఉన్నా.. ఎలా అవినీతికి పాల్పడగలను? : రత్నప్రభ

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే ఉన్నానని, అంత తక్కువ సమయంలో తాను ఎలా అవినీతికి పాల్పడగలనో మీరే చెప్పాలని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ ప్రశ్నించారు. ఈమె గతంలో కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ పదవి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు 
 
తనపై సీపీఐ నేత నారాయణ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. చీఫ్‌ సెక్రటరీగా మూడు, నాలుగు నెలల్లో ఏ మాత్రం అవినీతికి పాల్పడగలనో మీరే ఊహించాలని అన్నారు. తాను అవినీతి పరురాలినని ప్రజలు చెప్పాలి గానీ, ఎవరెన్ని మాట్లాడినా దానికి విలువ ఉండదన్నారు. ఐఏఎస్‌ అధికారిగా ఉన్నపుడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేశానని చెప్పారు. 
 
తొలుత చెన్నై-బెంగళూరు కారిడార్‌ మాత్రమే ఏర్పాటైందని, అప్పట్లో జరిగిన ఓ సమావేశంలో ప్రధాని మోడీని కలిసినపుడు చెన్నై-ఏపీ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం వినిపిస్తానన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల వారిని గెలిపించినా ప్రయోజనం ఉండదని, వారు తమ గళం వినిపించలేరని చెప్పారు.
 
ఇకపోతే,  గతంలో ఆమె వైసీపీకి అనుకూలంగా ట్వీట్‌ చేయడం గురించి ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించారు. మంచి ఎక్కడున్నా ప్రశంసిస్తానని ఆమె బదులిచ్చారు. 'రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. నిధులు ఏ రూపంలో వచ్చాయన్నది కాదు. ప్రత్యేక హోదా కావొచ్చు.. ప్రత్యేక ప్యాకేజీ కావొచ్చు. ఏ రూపంలో నిధులు వచ్చినా అభివృద్ధి జరుగుతుంది' అని ఆమె చెప్పుకొచ్చారు. 
 
కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని, స్మార్ట్‌సిటీగా తిరుపతిని అభివృద్ధి చేయడంతోపాటు అనేక కేంద్ర విద్యాసంస్థలను తిరుపతిలో ఏర్పాటు చేసిందని చెప్పారు.