శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (20:08 IST)

మోదీజీ... రూ 1,200 కోట్లు ఇవ్వండి... చంద్రబాబు నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల సంభవించిన తితిలీ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, బాధితులను ఆదుకొనేందుకు, పునరావాస కల్పనకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్ధిక సహాయంగా 1,200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి మరోమారు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
 
ఈ లేఖను ఆంధ్రప్రదేశ్ పునరావాస శాఖ కమీషనర్ డి. వరప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్‌లు సోమవారం ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర కాబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా, కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్‌లను కలసి అందచేసి తుపాను నష్ట వివరాలను విశదీకరించారు. 
 
ఈసందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునరావాస శాఖ కమీషనర్ డి. వరప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తితిలి తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లినదని బాధితులను ఆదుకొనేందుకు, పునరావాస కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో బస చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు.  రాష్ట్రప్రభుత్వ నిధులను వినియోగించి ప్రాధమికంగా బాధితులను ఆదుకుని పునరావాస చర్యలు కల్పిస్తున్నట్లు, ఈ విపత్తు వల్ల ప్రాథమిక అంచనాగా 2800 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినదని వివరిస్తూ తక్షణ ఆర్ధిక సహాయంగా 1200 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభత్వం నుంచి విడుదల చేయాలని ప్రధాన మంత్రికి ఈ నెల 13వ తేదీన, కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఈనెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
 
ఈ నిధుల విడుదల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మరోమారు చేసిన విజ్ఞప్తి లేఖను ప్రధాని కార్యాలయ అధికారులకు అందచేసినట్లు వివరించారు.  తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఉద్యానవన పంటలకు ప్రత్యేకించి జీడిమామిడితోటలకు, కొబ్బరి తోటలకు, విద్యుత్, గృహాలకు అపార నష్టం వాటిల్లినదని చెప్పారు. తుపాను వల్ల 1802 గ్రామాలలో విద్యుత్ సరఫరాకు పూర్తి నష్టం వాటిల్లగా, 1392 గ్రామాలకు పునరుద్ధరించినట్లు, త్రాగునీటి సరఫరాకు సంభందించి 19 సిపిడ్బ్ల్యుడి పథకాలకు నష్టం వాటిల్లగా యుద్ధప్రాతిపధికన విద్యుత్ జనరేటర్లను ఏర్పాటుచేసి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. 50 వేల గృహాలకు నష్టం వాటిల్లినదని, 1.65 లక్శల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 40 వేల హెక్టార్లలో జీడిమామిడి, కొబ్బరి, మామిడి పంటలకు, 144 మైనర్ ఇరిగేషన్ పథకాలకు, వంశధార ఆయకట్టుకాలవలకు అపార నష్టం వాటిల్లినట్లు వివరించారు.   
 
ఉద్యానవన పంటలకు 1000 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 505 కోట్ల రూపాయలు, రోడ్లు, భవనాలకు 406 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్, గ్రామీణ రహదారులకు 140 కోట్ల రూపాయలు, గ్రామీణ నీటి సరఫరాకు 100 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకు 802 కోట్ల రూపాయలు, నీటిపారుదల శాఖకు 100 కోట్ల రూపాయలు, గృహాలకు 220 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పౌరసరఫరాల శాఖలకు 50 కోట్ల రూపాయల చొప్పున, పురపాలక శాఖకు 9 కోట్ల రూపాయలు, వైద్య-ఆరోగ్య శాఖకు కోటి రూపాయల నష్టం వాటిల్లినదని, ఈ నష్ట వివరాలను, బాధితులను ఆదుకుంటున్న విధానాన్ని  సవివరంగా లేఖలో పొందుపరచి అందచేసినట్లు కమీషనర్ డి. వరప్రసాద్ వివరించారు.
 
ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ పాత్రికేయులతో మాట్లాడుతూ తితిలీ తుపానువల్ల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన నష్టాలపై ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖను ఈనెల 13వ తేదీన తాను స్వయంగా ప్రధాని కార్యాలయ అధికారులకు అందచేసి తక్షణ ఆర్ధిక సహాయ విడుదల గురించి సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రధాని నరేంద్రమోడీకి మరోమారు రాసిన లేఖను కేంద్ర అధికారులకు అందచేసినట్లు చెప్పారు.