శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (09:59 IST)

సిక్కోలు ప్రజలకు నా వంతుగా ఇది.. మరీ మీవంతుగా ఏం ఇస్తారు... యువ హీరో పిలుపు

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ నిజజీవితంలో రీల్ హీరో కాదని మరోమారు నిరూపించుకున్నాడు. ఇపుడు తిత్లీ తుఫాను విలయానికి సర్వం కోల్పోయిన సిక్కోలు ప్రజలకు తనవంతుగా సాయం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నారు.
 
ఇటీవల తనకు వచ్చిన మొదటి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళకు తన వంతుగా రూ.5 లక్షలు సాయం చేసి విజయ్ కొండంత మనసును చాటుకున్నాడు.
 
ఇపుడు మరోమారు తనలోని పెద్ద మనసును చాటాడు. తిత్లీ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది. 
 
ఇలాంటి తరుణంలో కేరళకు స్పందించిన మాదిరిగానే తమకు తోచినంతగా సిక్కోలు ప్రజలకు సాయం చేసి ఆదుకోవాలని సినీ హీరోలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు నడుంబిగించారు. ఇదివరకే టాలీవుడ్ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. ఇక్కడ్నుంచే సిక్కోలుకు సినీ ఇండస్ట్రీ సాయం మొదలైంది.
 
అంతేకాకుండా, తన వంతుగా సిక్కోలుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశాడు. తాను సీఎం రిలీప్ ఫండ్‌కు డబ్బులు పంపినట్లు స్క్రీన్ షాట్‌ను కూడా ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన విజయ్ అందరూ ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాలని ట్విట్టర్ వేదికగా ఆయన పిలుపునిచ్చాడు.