మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (16:47 IST)

తీరం దాటిన తితలీ... ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం...

తితలీ తుఫాను తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు - పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తర్వాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 
 
తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం అంతటా పెను గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, సోంపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటలకు 140 నుంచి 150 ఒక్కోసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
 
ఇదిలావుండగా, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. సంతబొమ్మాళి మండలంలోని డి మరువాడ ప్రాంతంలో సముంద్రం ముందుకు వచ్చింది. ఇసుక దిబ్బలు కోతకు గురయ్యాయి. హుద్‌హుద్ తర్వాత ఈ స్థాయిలో గాలులు వీయడం ఇప్పుడే చూస్తున్నామని మత్స్యకారులు తెలిపారు.
 
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం వద్ద సముద్రం బుధవారం 150 అడుగుల ముందుకు వచ్చింది. భీకర శబ్ధంతో అలలు తీరంపై విరుచుకుపడుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కొండ్రాజుపాలెంలో మత్స్యకారుల పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.