బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (09:23 IST)

భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. ఎక్కడ?

marriage
ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి చేశారు. ఈ ఆసక్తికర సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరియలు మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, ఆమెకు సంతానం లేదు. దీంతో 2005లో అప్పలమ్మను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ బాబు పుట్టాడు. 
 
ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అయితే, ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తమ ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గత నెల 25వ తేదీన తన ఇద్దరు భార్యలే పెళ్ళి పెద్దలుగా వ్యవహించి పెళ్లి పత్రికలు ముద్రించి, బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిపై పండన్న స్పందిస్తూ, తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తమ ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో త్యాగం చేసి తనకు మూడో వివాహం చేశారంటూ తెలిపాడు.