శ్రీవారికి దర్శించుకున్న ఉపరాష్ట్రపతి.. దేశ ప్రజలంతా సుఖశాంతులతో..?
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న ఉప రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
సన్నిధిలో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జవహర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ప్రార్థించానని ట్విటర్ వేదికగా వెల్లడించారు. "కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందదాయకం, దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించా" అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.