కేంద్రంలో అధికారం మాదే.. పడక సుఖం ఇస్తావా లేదా?: మహిళలపై బీజేపీ నేత దౌర్జన్యం!
విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత ఆగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందంటూ మండలంలోని మహిళలను బెదిరిస్తూ బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ భార్య వద్దకు వెళ్లి తనతో పడుకుని పడక సుఖం ఇస్తావా లేదా అంటూ బెదిరించాడు. దీనికి లొంగకపోవడంతో చేయిచేసుకున్నట్టు బాధిత మహిళ చెపుతోంది. ఇదేవిధంగా పలువురు మహిళల పట్ల సదరు నేత అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు అనేక మంది మహిళలు ఆరోపిస్తున్నారు.
ప్రసాదంపాడు గ్రామానికి చెందిన ఆ నేత చేస్తున్న హడావుడికి స్థానిక మహిళలు హడలి పోతున్నారు. పరిసర ప్రాంతంలో మహిళలను పరిచయం చేసుకోవడం ఆ పరిచయంతో ఇంట్లో పురుషులు లేని సమయంలో వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయడం అతనికి పరిపాటైపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అతని ఆగడాలను బాధిత మహిళలు మీడియా దృష్టికి తెచ్చారు. ముందుగా పరిచయం ఏర్పర్చుకోవడం ఆ తర్వాత ఫోన్ నంబర్లు తీసుకుని అసభ్యకరపదజాలంతో మాట్లాడుతున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకటి రెండుసార్లు ఫోన్ చేయడం ఆ తర్వాత ఏకంగా ఇంటికే వచ్చి చెప్పుకోవడానికి వీలులేని స్థాయిలో అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగుతున్నాడని బోరున విలపించారు. నెల రోజుల క్రితం ఇదేమిటని ఓ అపార్ట్‌మెంట్ కార్యదర్శి అతనిని అడిగే ప్రయత్నం చేసినందుకు దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. ఇప్పటికే ఇరువురు మహిళలు పటమట పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రసాదంపాడులో నివసిస్తున్న బీజేపీ నాయకుడిని తక్షణమే గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.