మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రకాశంలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య... ఎందుకంటే...

ప్రకాశం జిల్లాలో ఓ మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. వందల సంఖ్యలో వచ్చిన నివేశన స్థల దరఖాస్తులు తెల్లవారేసరికి పూర్తి చేయాలని పై అధికారి నుంచి హుకుం జారీ అయింది. దీంతో ఒత్తిడిని భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఆసీఫ్‌ నగర్‌కు చెందిన గ్రామ మహిళా వలంటీర్‌ షేక్‌ జుబేదా(19) గ్రామ వాలంటీర్‌గా పని చేస్తోంది. అయితే, ఎర్రగొండపాలెం తహసీల్దారు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శివప్రసాదాచారి మండలంలో నివేశన స్థలాల కోసం వందల సంఖ్యలో అందిన దరఖాస్తులను తీసుకుని శుక్రవారం రాత్రి జుబేదా ఇంటికి వెళ్లాడు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకల్లా దరఖాస్తులు పరిశీలించి, స్క్రూటినీ నివేదికను కార్యాలయానికి సమర్పించాలని గద్దించాడు. దీంతో అంత పనిని రాత్రికి రాత్రి ఎలా చేస్తానంటూ జుబేదా మనస్థాపానికి గురైంది. 
 
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మరుగుదొడ్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి కరిమూన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ బెదిరింపులే తన కుమార్తె మృతికి కారణమని తెలిపింది. జుబేదా మృతికి కారణమైన కంప్యూటర్‌ ఆపరేటర్‌పై కేసు నమోదు చేయాలంటూ బంధువులు మృతదేహంతో ఎర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌ సెంటరులో సాయంత్రందాకా ధర్నా చేశారు. ఆ తర్వాత మంత్రి ఆదిమూలపు సురేష్ జోక్యం చేసుకుని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరవించారు.