శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:41 IST)

విమానంలో వెళ్దామన్న భార్య... రైలులో పోదామన్న భర్త.. తర్వాత ఏం జరిగింది?

ఇటీవలి కాలంలో చిన్న విషయానికే బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఓ వివాహిత చిన్నపాటి విషయానికి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె పుట్టు వెంట్రుకలు తీసేందుకు తిరుపతికి విమానంలో వెళ్దామని భార్య కోరింది. కానీ, భర్త మాత్రం రైలులో వెళ్దామని చెప్పారు. ఈ విషయానికే ఆ వివాహిత కోపగించుకుంది. పైగా, తన మాట వినడం లేదనీ, కేవలం తల్లిదండ్రుల మాటకే విలువ ఇస్తున్నారని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ప్రవళ్లిక (30), వెంకటరమణ (38) భార్యాభర్తలు. 2014లో వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల వయసున్న పాప రిత్విక ఉంది. కుమార్తె పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 10వ తేదీన వీరు రైలులో తిరుపతి వెళ్లాల్సి ఉండగా, అనుకోని కారణాలతో వాయిదా పడింది.
 
దీంతో విమానంలో వెళ్దామని భర్తతో ప్రవళ్లిక గొడవ పడింది. భర్త సర్ది చెబుతున్నా వినిపించుకోని భార్య గత రెండుమూడు రోజులుగా గొడవ పడుతోంది. వారం రోజుల తర్వాత అందరం కలిసి రైలులో తిరుపతి వెళ్దామని వెంకటరమణ చెప్పుకొచ్చాడు. 
 
దీంతో తన కంటే తల్లిదండ్రుల మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నాడని మనస్తాపం చెందింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ప్రవళ్లిక బుధవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బహుశా తనపై అలిగి పడుకుందని వెంకటరమణ భావించాడు.
 
ఉదయం తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందికి దించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.