శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:46 IST)

భార్య సంసారం చేయడం లేదనీ వాహనాలకు నిప్పుపెట్టాడు

హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, జియాగూడకు చెందిన సంతోష్‌కు బోరబండకు చెందిన సబితతో పదేళ్ళ క్రితం వివాహమైంది. ఈమె పుల్లారెడ్డి మిఠాయి దుకాణంలో పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సంతోష్ మాంసం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
అయితే, మద్యానికి బానిసైన సంతోష్ తరచూ డబ్బుల కోసం భార్యను వేధించసాగాడు. భర్త ఇబ్బందులను తట్టుకోలేక నెలన్నర కిందట సబిత శ్రీరాంనగర్‌లోని తల్లిగారింటికి వెళ్లింది. అయితే సబిత కాపురానికి ఎంతకీ రాకపోవడంతో సంతోష్ ఆదివారం అర్థరాత్రి శ్రీరాంనగర్‌లోని భార్య పుట్టింటికి వచ్చాడు. 
 
అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సీసాలో పెట్రోలు తీసుకొచ్చి బావమరుదులకు చెందిన రెండు ఆక్టివాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా, అక్కడే పార్కింగ్ చేసివున్న ద్విచక్రవాహనాలు సైతం పూర్తిగా కాలిపోయాయి. వీటి సమీపంలో నిలిపి ఉన్న మరో ఇండికా కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. ఈ మేరకు సబిత ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా సంతోష్‌ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.