సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (14:27 IST)

పశ్చిమ బెంగాల్: ఒకే కుటుంబంలో ముగ్గురిని హత్య చేసిన ఘటనలో ఆర్ఎస్ఎస్ కోణం -బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షీదాబాద్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జియాగంజ్‌లో ఇటీవల ఒకే కుటుంబంలోని ముగ్గురు హత్యకు గురికావడం కలకలం రేపింది. సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. హంతకులు ఇంట్లోకి చొరబడి ముగ్గురినీ హత్య చేయడం అందుకు ఒక కారణమైతే. హత్యకు గురైన ఉపాధ్యాయుడికి ఆర్ఎస్ఎస్‌తో సంబంధం ఉందని చెప్పడం మరో పెద్ద కారణమైంది.

 
ఈ హత్యాకాండ గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఇప్పటివరకూ వాటికి సమాధానాలు దొరకలేదు. పశ్చిమ బెంగాల్ పోలీస్, సీఐడీ ఈ హత్యల వెనుక రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఘటన జరిగిన వారం తర్వాత కూడా ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

 
ఈ హత్యలపై విచారణకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మృతుడు బంధు ప్రకాశ్ పాల్ తండ్రి అమర్ పాల్ కూడా ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో హిందూయేతరులు ఎవరూ లేరు. విచారణ తర్వాత తమ అ అదుపులో ఉన్న వారిని వదిలేయవచ్చని పోలీసులు చెప్పారు.

 
ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు లేవు
బంధు ప్రకాశ్ పాల్‌కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌) లేదా భారతీయ జనతా పార్టీతో ఎలాంటి సంబంధాలూ లేవని మృతుడి తల్లి చెబుతున్నారు. దీంతో, బంధు ప్రకాశ్ పాల్, గర్భంతో ఉన్న ఆయన భార్య బ్యూటీ పాల్, ఏడేళ్ల కొడుకు ఆర్య పాల్‌ను ఎవరు, ఎందుకు ఇంత క్రూరంగా హత్య చేశారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. వ్యక్తిగత అంశాల వల్లే ముగ్గురినీ హత్య చేసుంటారని, ఇది రాజకీయంగా జరిగింది కాదని పోలీసులు అనుమానిస్తున్నారు.

 
"సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు రాజకీయ, లేదా మతపరమై కారణాలతో ఈ ట్రిపుల్ మర్డర్ జరగలేదని ఇప్పటివరకూ జరిగిన మా విచారణలో స్పష్టమైంది" అని పశ్చిమ బెంగాల్ పోలీస్ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) జ్ఞానవంత్ సింగ్ బీబీసీకి చెప్పారు.

 
మృతుడు బంధు ప్రకాశ్ పాల్ ఉపాధ్యాయుడు. ఆయన ఇన్సూరెన్స్ చెయిన్ మార్కెటింగ్ పని కూడా చేస్తున్నారు. ఫైనాన్షియల్ లేదా కుటుంబ కారణాలతో ఆయన్ను హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బంధువులను అందరినీ విచారిస్తున్నారు.

 
కేసు విచారణలో సీఐడీ సహకారం
సీఐడీ ఒక టీమ్ ఆదివారం సాగర్‌దిఘి పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహ్‌పూర్-బార్లా గ్రామంలో మృతుడి తల్లి మాయాపాల్‌తో మాట్లాడింది. సీఐటీ టీమ్ అక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో జియాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెబుబగాన్‌లో మృతుడి ఇంటికి కూడా వెళ్లారు. బంధు ప్రకాశ్ పాల్ అక్కడ తన భార్య, కొడుకుతో ఉండేవారు.

 
బంధు ప్రకాశ్ పాల్ ఏడాదిన్నర క్రితం లెబుబగాన్‌లో సొంత ఇల్లు కట్టుకున్నారు. తర్వాత సొంత ఊరు షాహ్‌పూర్-బర్లా నుంచి ఇక్కడికే వచ్చి ఉంటున్నారు. అయితే, స్వగ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో పాఠాలు చెప్పడానికి ఆయన రోజూ ట్రైన్లో బార్లా వెళ్లేవారు. ఆ స్కూల్ ఆయన తల్లి ఉంటున్న ఇంటికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. అక్కడ స్కూల్ అయిపోయాక ప్రకాశ్ తిరిగి జియాగంజ్‌లో ఇంటికి వచ్చేసేవారు. ఇటు, ముర్షీదాబాద్ ఎస్పీ ముకేశ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి చాలా వాస్తవాలు వెలుగుచూశాయని, దానిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే కేసును పరిష్కరిస్తామని చెప్పారు.

 
"మృతుడికి బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్నాయనేదానిపై మాకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అలా తప్పుడు ప్రచారం చేస్తుండవచ్చు" అని ముకేశ్ కుమార్ అన్నారు.

 
ఏది నిజం... ఏది అబద్ధం?
భారతీయ జనతా పార్టీ జియాగంజ్ ప్రాంతీయ అధ్యక్షుడు ప్రతాప్ హాల్దర్ కూడా లెబుబగాన్ ప్రాంతంలో ఉన్న బంధు ప్రకాశ్ పాల్ పొరుగింట్లోనే ఉంటారు. "బంధు ప్రకాశ్ బీజేపీ కార్యకర్త కాదు, కానీ, జనం ఆయనకు ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

 
దానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు "ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎలాంటి రిజిస్టర్ ఉండదు. అందుకే, ఆయన సంఘ్ శాఖలకు వెళ్లేవారా, లేదా అనేది నిరూపించడం అసాధ్యం. అయినా దీని గురించి సంఘ్‌లో ఉన్న వాళ్లు ఇంకా బాగా చెప్పగలరు" అని ప్రతాప్ చెప్పారు.

 
పక్కాగా చెప్పడం కష్టం
ఆర్ఎస్ఎస్ ముర్షీదాబాద్ జిల్లా అధ్యక్షుడు సమర్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ "బంధు ప్రకాశ్ పాల్ ఒక సంఘ్ స్వయం సేవక్. జియాగంజ్‌లోని ఆయన ఇంట్లో సంఘ్‌కు సంబంధించిన కొన్ని సమావేశాలు కూడా జరిగాయి. కానీ నేను మాత్రం బంధు ప్రకాశ్‌ను ఎప్పుడూ కలవలేదు" అన్నారు.

 
"ఆయన నాతో కలిసి ఏ సమావేశాల్లో పాల్గొనడం, శాకకు రావడం జరగలేదు. కానీ బంధు ప్రకాశ్ పాల్ మన శాఖలకు వస్తుంటారని నాకు సంఘ్‌లోని కొందరు స్వయం సేవకులు చెప్పారు. వారి మాటలను బట్టే ఆయన స్వయం సేవక్ అయ్యుంటారని నేను చెబుతున్నాను. కానీ, మా దగ్గర దానికి సంబంధించి ఫొటోలు, డాక్యుమెంట్లు ఏవీ లేవు" అని సమర్ చెప్పారు.

 
తల్లి ఒంటరి జీవితం
మృతుడు బంధు ప్రకాశ్ పాల్, మాయాపాల్‌కు ఒక్కగానొక్క కొడుకు. ఆమె వయసు ఇప్పుడు 70 ఏళ్లు. మాయాపాల్ తన ఏడుగురు తోబుట్టువుల్లో పెద్దవారు. పెళ్లైన కొన్నేళ్లకే ఆమె భర్తతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె షాహ్‌పూర్-బర్లాలోని తన పుట్టింటికి వచ్చేశారు. సోదరుడి ఇంట్లోనే ఉండిపోయారు.

 
అక్కడ ఉంటూనే ఆమె తన కొడుకు బంధు ప్రకాశ్, అతడి కవల సోదరి బంధు ప్రియ, తన పెద్ద కూతురు బంధు ప్రీతిలను పెంచి పెద్ద చేశారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. అయితే, తర్వాత కొన్నేళ్లకు ఆమె తన సోదరుడి ఇంటికి కొంత దూరంలో సొంత ఇల్లు కొనుక్కున్నారు. అప్పటి నుంచి తన కొడుకు, కోడలు, మనుమడితో అదే ఇంట్లో ఉండేవారు. ఏడాదిన్నర క్రితం బంధు ప్రకాశ్ గ్రామం వదిలి జియాగంజ్ వెళ్లిపోయినప్పటి నుంచి ఆమె అక్కడ ఒంటరిగా ఉంటున్నారు.

 
నా కొడుకు ఏ పార్టీలోనూ లేడు
మాయా పాల్ బీబీసీతో "నా కొడుక్కి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వేరే ఏ పార్టీతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. ఎవరు వచ్చి చందా అడిగినా ఇచ్చేవాడు. కానీ తన పని తాను చేసుకునేవాడు. రాజకీయాలకు చాలా దూరంగా ఉండేవాడు. జనం ఇలా అబద్ధాలు ఎందుకు చెబుతున్నారో, టీవీలో, పత్రికల్లో తప్పుడు వార్తలు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అన్నారు.

 
"పోలీసులు తలుచుకుంటే, హత్య జరిగిన రోజే హంతకులను పట్టుకునేవారు. కానీ ఇప్పటికి ఆరు రోజులైనా వాళ్లు ఎవరినీ పట్టుబడలేదు. అలాంటప్పుడు పోలీసులను ఎలా నమ్మగలం" అన్నారు.

 
ప్రకాశ్ తండ్రికి రెండు పెళ్లిళ్లు
ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భార్య మాయా పాల్‌తో విడిపోయిన బంధు ప్రకాశ్ తండ్రి అమర్ పాల్ రాంపూర్ హాట్‌లో ఉన్న తన ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. తర్వాత కొన్నేళ్లకు ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీనిపై బంధు ప్రకాశ్ తన తండ్రితో గొడవపడేవారని గ్రామస్థులు చెప్పారు. అందుకే, పోలీసులు మృతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.

 
రాజకీయం చేశారని ఆరోపణలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ముర్షీదాబాద్ జిల్లా అధ్యక్షుడు అబూ తాహెర్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ, "బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోంది. అవాస్తవాలు ప్రచారం చేసి వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆ ఉపాధ్యాయుడికి ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు లేవని, అతడి కుటుంబంలో వారే చెబుతుంటే, దానిపై మేం ఏం చెప్పగలం" అన్నారు.

 
"దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోంది. ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది కొన్ని రోజుల్లో బయటపడుతుంది" అని ఆయన చెప్పారు. ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్నా హత్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి, దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనేది హంతకులు ఎవరనేది తెలిసినప్పుడే బయటపడనుంది.