గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (07:43 IST)

మహిళ ఫోన్ చేస్తే చాలు.. చర్యలు: హోం మంత్రి సుచరిత

మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడానికి మహిళా మిత్రను ప్రారంభించామని, ఒక్క‌ ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

'మహిళలు - సైబర్ నేరాలు' అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ విజయవాడలో ఏర్పాటుచేసిన సెమినార్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మహిళా కమిషన్ ప్రచురించిన 'మహిళలపై సైబర్ నేరాలు తీసుకోవలసిన చర్యలుస‌ బుక్‌ను విడుదల చేశారు.

అనంతరం హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ రోజురోజుకి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడానికి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే స్పందించి పరిష్కరించడానికి పోలీసు శాఖ జులైలో సైబర్ మిత్ర, ఆగష్టులో మహిళా మిత్రలను ప్రారంభించిందని తెలిపారు.

మహిళలు గతంలో లాగా పోలీసు స్టేషనుకే వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ నెంబరును, వెబ్‌సైట్‌ను ప్రారంభించామని ఒక ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషించాలో అదే టెక్నాలజీ బారినపడి అనేకమంది చిన్నారులు, మహిళలు వివిధరకాలుగా మోసాలకు గురవుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నామన్నారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యార్ధులు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతూ తద్వారా అనేక రకాలుగా మోసగించబడి ఎవరికి చెప్పుకోవాలో తెలియనిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఎక్కువగా తెలిసినవాళ్ళు ప్రక్కన ఉండేవాళ్ళే చిన్నపిల్లల్ని మోసం చేసి హత్యలుచేయడం చూస్తున్నామన్నారు.

ఇంటర్నెట్లో వచ్చే వీడియోలు వెబ్ సైట్లు చూసి కొందరు సైటిక్ లక్షణాలు అలవర్చుకొని పసిపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. గత రెండు నెలల్లో ఇటువంటివి నాలుగు సంఘటనలు చూశామని హెూంమంత్రి చెబుతూ ఇటీవల విజయవాడ చిత్తూరు జిల్లాలో పసిపిల్లలపై జరిగిన సంఘటనలను ఉదహరించారు. పిల్లలు సెల్ ఫోన్లు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉంటూ టెక్నాలజీని మంచికి ఉపయోగించుకొనేలా పిల్లలకు అలవాటుచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు.

గతంలో పెద్ద కుటుంబాలు ఉండేవని ప్రస్తుతం అన్నీ చిన్నకుటుంబాలు కావడంతో పిల్లలు ఎక్కువ సమయం నెట్లో గడపడం కూడా ఇటువంటి మోసాలబారిన పడటానికి కారణమన్నారు. నేరగాళ్ళు టెక్నాలజీని ఉపయోగించే ఫొటోలను వీడియోలను రకరకాలుగా మార్ఫింగ్ చేసి బెదిరిస్తూ ఉంటారని, బ్యాంకు ఎకౌంట్లలో డబ్బును మాయం చేస్తూ ఉంటారని అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇటువంటి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నందుకు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను హోంమంత్రి అభినందించారు. 

మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ టెక్నాలజీకి రెండువైపులా పదునుందని చెబుతూ దురదృష్టవశాత్తూ దీన్ని నేరపూరిత చర్యలకు మహిళలు పిల్లలను వేధింపులకు గురిచేయడానికి వినియోగిస్తున్నారని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు.

గతంలో మహిళలు ఈవ్ టీజింగ్, వివాహ సంబంధమైన సమస్యలు, గృహహింస వంటి సమస్యలను ఎదుర్కొనేవారని ఇప్పుడు వాటికి అదనంగా ఈ సైబర్ నేరాలు వచ్చాయని అన్నారు. అవి ఎక్కడ నుండి జరుగుతున్నాయో ఎవరు చేస్తున్నారో తెలియకుండా ముసుగు వేసుకున్నట్లుగా చేస్తుంటారని దాంతో వారిని తెలుసుకోవడం పట్టుకోవడం కష్టంగా మారిందని అన్నారు.

దాంతో నేరస్తులు కూడా మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతో ఇంకా ఎక్కువగా వాటికి పాల్పడుతుంటారని వాటిని నివారించడానికి ప్రభుత్వం పోలీసు శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటుందని అటువంటి చర్యలలో భాగంగా సైబర్ మిత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఇటువంటి వారిని పట్టుకుని తగిన శిక్షలు పడేవిధంగా చేయడానికి చట్టాలు తయారుచేస్తున్నామన్నారు.

స్పందన కార్యక్రమం ద్వారా మహిళలకు ధైర్యమిచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. స్పందన ద్వారా మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరుగుతున్న వేదింపులను ధైర్యంగా చెప్పగలుగుతున్నారన్నారు. గ్రామ సచివాలయాలలో కూడా ఒక మహిళా పోలీసును పెట్టడం, బార్లు మద్యం షాపులు తగ్గించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం మహిళల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

అదేవిధంగా టెక్నాలజీ, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ పేరుతో ఇతర సోషల్ మీడియా ద్వారా ఆడపిల్లల్ని ఎలా ట్రాప్లో పడేసి మోసాలు చేస్తున్నారు అటువంటి మోసాలకు గురికాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల్లో రెండు నెలలకు ఒకసారి కౌన్సిలర్లను పెట్టి అవగాహన కల్పించే విధంగా మహిళా కమీషన్ తరపున కృషిచేస్తామన్నారు.

మహిళలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా మహిళా కమీషన్ వెంటనే అక్కడకు వెళుతుందని సమస్యను మనమంతా ధైర్యంగా ఎదుర్కొందామని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీజీపీ గౌతమ్ స‌వాంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.