సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (11:52 IST)

ఒక్క నిమిషం నేను రాజన్న బిడ్డను కాదనుకుందాం... రండిరా.. మీ దమ్మేందో చూపించండి.. వైకాపా నేతలకు షర్మిల సవాల్

ys sharmila
తాను ఒక్క నిమిషం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం... రండి. ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం. ఏం చేస్తారో చేయండి. మీ దమ్మేందో చూపించండి. అంటూ వైకాపా నేతలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ సవాల్ విసిరారు. ఆమె ఆదివారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. నగరిలో జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన అశేష ప్రజానికానికి, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు. లోకల్ ఎమ్మెల్యే, మంత్రి రోజాపైనా ఆమె విరుచుకుపడ్డారు. 'రోజమ్మా... నోరుంది కదా అని పారేసుకోవద్దు... పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు... రేపు మీ పరిస్థితి కూడా అంతే అని స్పష్టం చేశారు. 
 
ఇంకొకరు... నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి బాపట్ల నుంచి అవతలికి అడుగుపెట్టనిచ్చాం అని అంటున్నారు. ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం... రండి, ఎంతమంది వస్తారో రండి... చూసుకుందాం. ఏం చేస్తారో చేయండి... మీ దమ్మేందో చూపించండి. సిగ్గుండాలి కదా... రాజశేఖర్ రెడ్డి పేరుతో, రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ, మగ తేడా లేకుండా నీచంగా వ్యవహరించారు. ఈ ఐదేళ్లలో అన్ని మాటలు తప్పారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు పోలికే లేదు. ప్రతి మాట తప్పారని ఆరోపించారు. 
 
ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ తప్పులను ఎత్తిచూపుతున్నానని, చెల్లెల్ని అనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారు. 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇదే పార్టీ (వైసీపీ)ని నేను నా భుజాల మీద మోశాను. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, ఓదార్పు యాత్ర చేశాను, బై బై బాబు క్యాంపెయిన్ చేశాను. ఎక్కడ అవసరం వస్తే అక్కడ నా సేవలు అందించాను. నాకు ఈ పదవి కావాలి అని అడగలేదు. ఆ పార్టీ (వైసీపీ) ఓ మొక్కగా ఉన్నప్పుడు నా చేతులతో నీళ్లు పోశాను, ఎరువు వేశాను, కాపాడాను. ఇప్పుడా పార్టీ ఓ చెట్టు అయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదంటున్నారు కదా! మీ మాటలతో మీ అహంకారం ఎంతో తెలుస్తోంది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్లీ చెబుతున్నా... నేను ప్రజల కోసమే వచ్చాను అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదు. వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ఎన్నికలప్పుడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పడం కాదు. వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకోవడం, యువత బంగారు భవిష్యత్తు కోసం పనిచేయడం, రైతును రాజు చేయడం, మహిళలకు స్వయం సమృద్ధి కల్పించడం కానీ జగనన్న ప్రభుత్వం ఇవన్నీ గాలికొదిలేసి కేంద్రంలో ఉన్న బీజేపీతో డ్యూయేట్లు పాడుతోంది. ప్రత్యేక హోదా సాధించడం కోసం జగనన్న, చంద్రబాబు కృషి చేసింది లేదు. ఆంధ్రరాష్ట్రానికి మేలు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. 
 
జలయజ్ఞం వైఎస్సార్ కలల ప్రాజెక్ట్. రాష్ట్రంలో 54 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి 12  ప్రాజెక్టులు పూర్తి చేశారు ఆ మహానేత. . పెండింగులో ఉన్న 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని జగనన్న ఎన్నికల్లో హామీ ఇచ్చాడు.. తీరా అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టికూడా తీయలేదు. ఇక్కడ గాలేరు - నగరి ద్వారా సాగునీరు రావాల్సి ఉంది . ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే వేల ఎకరాల్లో సాగునీరు వచ్చేది. ఇదేనా వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇదేనా ఆయన సంక్షేమ పాలన కొనసాగించడం అంటే? అంతా దోపిడీ రాజ్యం. నియంత పాలన అని మండిపడ్డారు.