ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (16:19 IST)

వైఎస్ కుమార్తె కాబట్టే బాపట్ల దాటనిచ్చాం : వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి

kona raghupathi
ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు వైకాపా నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. షర్మిలను లక్ష్యంగా చేసుకుని శీలహననం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా, జగన్‌ను ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. సిద్ధం అంటున్న మీరు దేనికి సిద్ధం? అని సూటిగా ప్రశ్నించారు. మరో రూ.8 లక్షల కోట్లు అప్పు చేయాడానికా? పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని దగా చేయడానికా? మద్య నిషేధం అని మరోసారి మోసం చేయడానికా? అంటూ ప్రశ్నించారు. వైకాపా పాలనలో రాష్ట్ర సర్వనాశనం అయిందని ఆమె ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీలకు ఇసుకపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని ఆమె విమర్శించారు. 
 
ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై, సీఎం జగన్‌పై షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, వైఎస్ రాజశేఖర్ బిడ్డ కావడం వల్లే ఆమె బాపట్ల సరిహద్దులు దాటనిచ్చామని అన్నారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామని అన్నారు. షర్మిల కాకుండా మరో నేత ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటే  బాపట్ల సరిహద్దులు దాటేవారే కాదని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జజసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంత మంది నాయకులు వచ్చినా జగన్‌ను టచ్ చేయలేరని ఆయన అన్నారు.