జగన్ తండ్రికి తగ్గ తనయుడు, సంస్కర్త, అభ్యుదయవాది: సజ్జల
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత డా|| వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు డా|| సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా|| ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ శ్రీమతి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ తదితరులు వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక మామూలు మనిషి నిబధ్దతతో, పట్టుదలతో, మంచి ఆలోచనలతో మానవతావాదిగా పనిచేస్తే మహామనిషిగా ఎలా ఎదగవచ్చో నిరూపించినవ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైయస్ జగన్ ఆ తండ్రికి తగ్గ తనయుడుగానే కాకుండా, ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, సామ్యవాదిగా నిలుస్తున్నారని తెలిపారు. గతంలో మనం మంచి పాలన అందిస్తే రామరాజ్యం అని చెప్పుకునే వాళ్లం.... ఆ తర్వాత వైయస్ సువర్ణయుగం రాజన్నరాజ్యంగా పేరు పొందింది. నేడు జగనన్నరాజ్యంగా మన ముందుకు తీసుకువచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజారంజకపాలన అందిస్తున్నారన్నారు.