నేడు వైఎస్‌ఆర్ వర్ధంతి.. వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం జగన్ నివాళులు
దివంగత మహానేత, ప్రజల మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కడప జిల్లాలోని ఇపుడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్... పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఆయనతో పాటు సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి సోదరుడితో దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న షర్మిల ఈ సందర్భంగా సీఎం జగన్ పక్కనే కూర్చోవడం గమనార్హం.
అంతకుముందు వైఎస్సార్ జగన్ తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది" అంటూ ట్వీట్ చేశారు.