మూడో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం : రూ.24 వేలు చొప్పున...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద మూడో విడత నిధులను మంగళవారం జమ చేశారు.
మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేశారు. ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ.24 వేలు చొప్పున నగదు డిపాజిట్ అయింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.166.14 కోట్లు నేరుగా 69,225 చేనేత కుటుంబాల ఖాతాలకు జమ చేశారు. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం.
నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది.
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.