మీకు 18 ఏళ్లు నిండాయా? ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం!
మీకు 18 ఏళ్లు నిండాయా? అయితే ఇపుడు కొత్తగా ఓటరుగా నమోదుకు మీకు అవకాశం వచ్చింది. ఓటరు నమోదుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెడ్యూల్ విడుదల చేశారు.
కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. జనవరి 1,2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు.
► ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరకు ఇంటింటి ఓటరు జాబితా పరిశీలన.
► నవంబర్1న ముసాయిదా ఓటరు జాబితా విడుదల.
► నవంబర్ 30 వరకు అభ్యంతరాల స్వీకరణకు అనుమతి.
► నవంబర్ 20, 21 తేదీల్లో ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమం.
► అదే తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
► ఆ పోలింగ్ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in లేదా వోటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► డిసెంబర్ 20 నాటికి అభ్యంతరాల పరిశీలన పూర్తి.
► జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల.
ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,నగర పంచాయతీల కమిషనర్లను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రచురించాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.