శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. ఏపీ టూరిజం
Written By ttdj
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (14:19 IST)

హార్సిలీ హిల్స్‌లో పడిపోయిన ఉష్ణోగ్రత - క్యూ కడుతున్న పర్యాటకులు

ఆ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఒక్క రోజైనా ప్రశాంతంగా సేదతీరాలనుకునే వారికి అది చాలా సరైన ప్లేస్‌. ప్రకృతి అందాలతో కనువిందు చేయడంతో పాటు కావాల్సినంత ప్రశాంతతను అందించడం ఆ ప్రాంతం యొక్క ప్ర

ఆ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఒక్క రోజైనా ప్రశాంతంగా సేదతీరాలనుకునే వారికి అది చాలా సరైన ప్లేస్‌. ప్రకృతి అందాలతో కనువిందు చేయడంతో పాటు కావాల్సినంత ప్రశాంతతను అందించడం ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత. ఇన్ని క్వాలిటీస్‌ ఉన్న ఈ ప్రదేశం ఏ దేశంలో అనుకుంటున్నారా.. అక్కడెక్కడో కాదండి బాబూ. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి సమీపంలో ఉన్న హార్సిలీ హిల్స్. ఇంకెందుకు ఆలస్యం ఈ అందాల యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందామా...
 
చుట్టూ కమ్ముకునే మంచు దుప్పట్లు. వెచ్చదనం గొలిపే గెస్ట్ హౌస్‌లు. ఆ వాతావరణానికి తగిన ఆహార పదార్థాలు, కంప్లీట్‌గా ఒక ఫుల్‌ టూరిజం ప్యాకేజీలాగా ఉంటుంది హార్సిలీ హిల్స్. చిత్తూరు జిల్లాకే తలమానికంగా పర్యాటక రంగంలో తనదైన స్థానాన్ని ఇప్పటికీ నిలుపుకుంటున్న హార్సిలీ హిల్స్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. మూడు రాష్ట్రాల ప్రజలు నిత్యం ఇక్కడకు వస్తూ ఉంటారంటే ఆ ప్రాంతానికి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 
 
పెద్ద పెద్ద రాజకీయ నాయకులను మొదలుకుని సినీతారల వరకు ఇక్కడ సేద తీరాలని ఆశపడతారు. అందుకే సామాన్య ప్రజల కంటే కూడా వీఐపీల తాకిడి ఈ ప్రాంతానికి ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే లగ్జరీ గెస్ట్ హౌస్‌లు, అధునాతనమైన వసతి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ కొండపైకి వెళ్ళే ప్రయాణమే ఒక తీపిజ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం చిత్తూరు జిల్లాలో ఉండడానికి కారణమేంటి. ఇంతటి ప్రకృతి రమణీయత అక్కడికి ఎలా వచ్చి చేరింది.
 
చిత్తూరు జిల్లాలో శేషాచల అడవులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. ఎన్నో జీవ వైవిద్యాలకు ఈ కొండలు పుట్టినిల్లు లాంటివి. అలాంటి వాటిల్లో హార్సిలీ హిల్స్ కొండలు మరి కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తు ఉండడమే అక్కడి ఈ ప్రత్యేక వాతావరణానికి కారణం. ఈ ప్రాంతానికి మొదట బ్రిటీష్‌ కాలంలో కడప కలెక్టర్‌గా పనిచేసిన హార్సిలీ దొర మొదటగా ఈ కొండలను దానిపైన ఉన్న వాతావరణాన్ని గుర్తించారు. ఒకానొక సమయంలో ఆయన అటువైపు పయనిస్తుండగా తనకు తగిలిన చల్లని గాలులను పట్టుకుని అలాగే కొండపైకి వెళ్ళడంతో అక్కడ కొన్ని అద్భుత దృశ్యాలు ఆయన కళ్ళ ముందు ఆవిష్కతమయ్యాయి.
 
ప్రభుత్వ అధికారిగా ఉన్న హార్సిలీ ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకోవడంతో అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈయన పేరు మీదనే ఆయన పేరు మీదనే కొండలకు హార్సిలీ హిల్స్ కొండలు అనే పేరు వచ్చింది. తర్వాత కాలంలో ఆయనకు చిహ్నంగా ఆయన సమాధిని కూడా ఈ ప్రాంతంలోన నిర్మించారు. ఈ ప్రాంతాన్ని గుర్తించిన ప్రభుత్వం, అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారులు అభివృద్ధి చేశారు. దానికితోడు చెన్నై, బెంగుళూరు నగరాలకు దగ్గరగా ఉండటంతో అక్కడి సినీతారల తాకిడి కూడా వీటికి ఉండేది. దీంతో సినిమా ఘూటింగ్‌లు కూడా ఇక్కడ తరచూ జరుగుతుంటాయి. 
 
హార్సిలీ హిల్స్‌కు అన్ని రకాల సందర్శకులు వస్తుంటారు. పిల్లలతో పాటు వచ్చే ఫ్యామిలీలు కొన్ని అయితే కొత్తగా పెళ్ళయిన జంటలు కూడా హనీమూన్‌కు హార్సిలీ హిల్స్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మరోవైపు వీఐపీల తాకిడి ఎలాగో ఉండనే ఉంటుంది. సహజ సిద్ధంగా వచ్చినటువంటి ప్రకృతి అందాలు బోలెడన్ని ఉంటే వాటికి ఉంటే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవడం కోసం జూపార్కును ఏర్పాటు చేశారు. అన్ని కాలాల్లోను ఒకే వాతావరణాన్ని, ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉండటం ఈ ప్రాంతం యొక్క మరో ప్రత్యేకత. 
 
అందుకే ఏ కాలంలోనైనా ఇక్కడికి వచ్చే పర్యాటకుల రద్దీ ఒకే విధంగా ఉంటుంది. ఒకవైపు పక్షుల కిలకిల రావాలు, మరో వైపు తమ వెంట వచ్చే ఆత్మీయ వ్యక్తుల పలుకరింపులు పర్యాటకులను ఎంతగానో పులకరింపజేస్తాయి. జీవితంలో ఒకసారైనా హార్సిలీహిల్స్ కు వెళ్ళి ఒకరోజు గడపాలని చాలామంది ఆరాటపడతారు. ఒకరోజు అక్కడికి వెళ్ళివచ్చిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్ళారని కోరుకుంటారు. మరెందుకు ఆలస్యం ఇంతటి ప్రకృతి అందాలను మీరు ఆస్వాదించాలంటే హార్సిలీ హిల్స్‌కు వెళ్ళాల్సిందే.