శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:59 IST)

నా భర్తను డిస్టింక్షన్‌లో పాస్ చేయండి : నారా భువనేశ్వరి విజ్ఞప్తి

ఈనెల 11వ తేదీన ఎన్నికల పరీక్ష రాయనున్న తన భర్త, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిస్టింక్షన్‌లో పాస్ చేయించాలని ఆమె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రచారానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో వైకాపా, టీడీపీలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రచారంలో నిమగ్నమైవున్నారు.
 
ఇప్పటికే వైకాపా నుంచి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తల్లి వైఎస్. విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల, భార్య వైఎస్. భారతిలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వీరంతా రాష్ట్రంలోని 13 జిల్లాలలను చుట్టేస్తున్నారు. దీంతో టీడీపీ తరపున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామీలీ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారబరిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లు ప్రచారం చేస్తున్నారు. ఇపుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా రంగంలోకి దిగారు. అయితే, ఈమె ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలోకి రాకపోగా, వీడియో కాన్ఫెరెన్స్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. 
 
తన భర్త చంద్రబాబును ఈ ఎన్నికల్లో గెలిపించేలా కృషి చేయాలని భువనేశ్వరి కుప్పం టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. భువనేశ్వరి కుప్పం కార్యకర్తలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇందులో సుమారు 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి 75 శాతం ఓట్లతో డిస్టింక్షన్‌లో నారా చంద్రబాబును పాస్‌ చేయించాలని కార్యకర్తలకు ఆమె విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అటు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ప్రచారంలో దూసుకుపొతున్న నేపథ్యంలో ఇటు భువనేశ్వరి సైతం వీడియో కాన్ఫెరెన్స్‌ల ద్వారా కార్యకర్తలకు సూచనలు చేయడం గమనార్హం.