సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:10 IST)

వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణం గుర్తులేదా? అలా మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి, తన ప్రభుత్వం గురించి చేసిన ట్వీట్లకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన ప్రమాణం గుర్తులేదా.. అలా మాట్లాడటానికి సిగ్గేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 
 
సోమవారం రాజమండ్రిలో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. "ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు" అని ఓ ట్వీట్ చేశారు. 
 
అలాగే, సికింద్రాబాద్... భారత్‌ను మరింత సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దడంలో కష్టపడి పనిచేసే ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉంది. అలాంటి సికింద్రాబాద్ ప్రజలతో ఈరోజు సాయంత్రం కలిసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అంటూ రెండో ట్వీట్ చేశారు. 
 
ఈ రెండు ట్వీట్లకు చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. "ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు. 
 
"నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?"
 
తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి నరేంద్ర మోడీగారూ...? పైగా రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడటానికి సిగ్గేయ్యటంలేదూ!? అంటూ చంద్రబాబు తన ట్వీట్లలో మండిపడ్డారు.