నంద్యాల జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం విషమం... అభ్యర్థుల్లో ఆందోళన
నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం బాగా విషమించింది. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ను అమర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో మిగిలిన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠతో పాటు ఆందోళన నెలకొంది.
నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డికి టీడీపీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున బరిలోకి దిగారు. ఎండలు మండుతున్నా.. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాలుగు రోజుల కిందట మొదట వడదెబ్బ తగిలింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అయితే, ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన వెంటనే కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. మూడు రోజుల్లో పోలింగ్ జరుగనుంది. ఈ సమయంలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు రావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ, ఆయన కోలుకోవాలని ఇతర పార్టీల అభ్యర్థులు ఆకాంక్షించారు. ఎన్నికల అంకం చివరి దశకు చేరుకున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.