శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 17 డిశెంబరు 2015 (13:14 IST)

కాల్ మనీ హీట్... ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు వైకాపా సభ్యుల సస్పెన్షన్

కాల్ మనీ హీట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు నాడే కుదిపేసింది. కాల్ మనీ దందాపై చర్చకు అనుమతించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇందుకు అనుమతించాలంటూ ఆ పార్టీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరెడ్డికి సమర్పించారు. ఐతే ఆ తీర్మానాన్ని కోడెల తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీనితో సభను స్పీకర్ రెండుమార్లు వాయిదా వేశారు. 
 
సభ తిరిగి ప్రారంభమయినప్పటికీ వైసీపి సభ్యులు సభలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకున్నారు. తాడిశెట్టి రామలింగేశ్వర రావు అలియాస్ రాజా(తుని), శివప్రసాదరెడ్డి(ప్రొద్దుటూరు)లు ఇద్దరూ ప్రత్యక్ష ప్రసారాలను అందించే వీడియో కెమెరాలకు అడ్డుగా నిలబడ్డారు. స్పీకర్ వారిద్దరినీ అక్కడ నుంచి తమ స్థానాలకు వెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. 
 
పరిస్థితి దారికి రాకపోవడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వారిద్దరినీ ఒక రోజు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరడమూ, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ వారిద్దరినీ రెండు రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. కాగా దీనిపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. యనమల తమ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేయమని అడిగితే స్పీకర్ రెండురోజులు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు.