శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (12:12 IST)

ఏవోబీలో టెన్షన్ టెన్షన్... 23కు పెరిగిన మావోయిస్టుల మృతుల సంఖ్య

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 23కు చేరింది. కూంబింగ్‌లో ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభి

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 23కు చేరింది. కూంబింగ్‌లో ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఒడిశా సరిహద్దులోని అటవీప్రాంతం చిత్రకొండ, జెంత్రీ మధ్యలో బూసుపట్టి ఏరియాకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఏపీ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. రాత్రి విశాఖ జిల్లాలోని ముంచింగుపట్టి ప్రాంతంలో సెల్ సిగ్నల్స్‌ను నిలిపివేశారు.
 
ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో పలువురు మావో అగ్రనేతలు కూడా ఉన్నారు. అలాగే మృతి చెందిన వారిలో గాజర్ల రవి, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, మున్నాలను గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత కొడుకే మున్నా అని సమాచారం. గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. మావోల కాల్పల్లో ఓ పోలీసు అధికారి గాయపడగా, అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
కాగా, ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, ఏడు ఎస్సెల్లార్‌లు, 303 రైఫిళ్లు 15, ల్యాండ్‌మైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను, మావోయిస్టుల మృతదేహాలను హెలికాప్టర్‌లో మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌తో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. పక్కా సమాచారంతో ఏపీ, ఒడిశా, కేంద్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు పేర్కొన్నారు.