గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (16:20 IST)

ముంబై నటి వేధింపుల కేసు : ఐపీఎస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

kanti - vishal
ముంబై నటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలకు కూడా ప్రభుత్వం సమాయత్తమవుతుంది. 
 
ఈ కేసులో సంబంధం ఉన్న ఏసీపీ హనుమంతరావు, సీఐ ఎం.సత్యానారాయణరావుపై ప్రభుత్వం వేటు వేసింది. జెత్వానీ వద్ద విచారణ జరిపిన వ్యవహారంలో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జెత్వానీని ఆగమేఘాలపై సత్యనారాయణ రంగంలోకి దిగి ముంబై నటిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు వీరిద్దరినీ సస్పెండ్ చేసింది. 
 
గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వానీ కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. జెత్వానీ ఇంటరాగేషన్ హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీసు కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంటరాగేట్ చేశారు. 
 
దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జెత్వానీని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ కేసులో అన్నీ తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ తదితరులపై చర్యలకు రంగం సిద్ధమైంది.
 
మరోవైపు, తల్లిదండ్రులు, న్యాయవాదులు పీవీజీ ఉమేశ్ చంద్ర, పాల్‌తో కలిసి గతరాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌రు వచ్చిన నటి జెత్వానీ విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగరైపై ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు తమను అరెస్టు చేశారని, ఏ తప్పూ చేయకున్నా తమ కుంటుంబం 42 రోజులపాటు జైలులో మగ్గిందని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులతోపాటు విద్యాసాగర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.