ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (11:16 IST)

ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు వేధింపులకు పాల్పడ్డారు : ముంబై నటి జైత్వానీ లాయర్

jaitwani kadambari
తనను కిడ్నాప్ చేసి, వేధింపులకు పాల్పడిన ఐపీఎస్ అధికారుల్లో ఆ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారని ముంబై నటి జైత్వానీ కాదంబరి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఇదే అంశంపై శుక్రవారం విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. తమ క్లెయింట్‌ను వేధింపులతో పాటు చిత్రహింసలకు గురిచేసిన వారిలో ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆయన తెలిపారు. ప్రధానంగా నాటి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనరుగా ఉన్న కాంతిరాణా టాటా, మరో పోలీస్ అధికారి విశాల్ గున్నీలు కీలక పాత్ర పోషిచారని తెలిపారు. 
 
అయితే, తనపై ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్లి అనేక రకాలుగా విచారణ చేశారు. ఎవరినైతే ఫిర్యాదుదారుడిగా పెట్టుకుంటే బాగుంటుందో ముందే ఆలోచించుకుని, విజయవాడకు చెందిన ఒక వ్యక్తిని రంగంలోకి దింపారు. అదేవిధంగా అగ్రిమెంట్‌ను కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగానే జరిగినట్టు నటి కాదంబరి జెత్వానీ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇవే విషయాలను ఆమె పోలీసులకు తెలియజేస్తున్నారు.
 
ముంబై కేసును వెనక్కి తీసుకోవడం కోసం అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాలని పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని ఆమె చెబుతోంది. ఆ ఇద్దరు స్థానిక పోలీసు అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతోంది. సీసీ టీవీ కెమెరా ఫుటేజి పరిశీలించడం ద్వారా వాళ్లెవరన్నది తేలుతుంది అని ఆమె తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.