శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (12:21 IST)

బస్సు డ్రైవర్లు కాదు... తాగుబోతులు : మద్యం మత్తులో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు

విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు సంస్థలకు చెందిన ప్రైవేట్ బస్సులను ఆపి వాటిని నడుపుతున్న డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతున్నట్టుగా గుర్తించారు. 
 
సోమవారం రాత్రి విజయవాడ సమీపంలోని కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతూ, బస్సును నడుపుతూనే మద్యం తాగుతున్నారనడానికి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. 
 
ఈ పోలీసుల తనిఖీల్లో వెంకట పద్మావతి, జీవీఆర్‌, కనకదుర్గ ట్రావెల్స్‌ డ్రైవర్లు తనిఖీల్లో పట్టుబడగా, వారందరిపై కేసులను నమోదు చేశారు. ఆ తర్వాత వీరిని బస్సులు నడిపేందుకు పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో బస్సులో మరో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట నడిరోడ్డుపై పడిగాపులు కాయాల్సి వచ్చింది.