ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 జూన్ 2021 (15:52 IST)

గాఢంగా ప్రేమించాడు, దారుణంగా నరికి సూట్ కేసులో...

గాఢంగా ప్రేమించాడు. ఆమె లేనిదే చచ్చిపోతానన్నాడు. కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించారు. ప్రేమ పెళ్ళి జరిగిపోయింది. అన్యోన్యంగా వీరి సంసారం సాగుతోంది. అయితే మద్యానికి బానిసైన ఆ భర్త అతి కిరాతకంగా భార్యను చంపేశాడు. ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేసులో వేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలో జరిగింది.
 
చిత్తూరు జిల్లా రామసముద్రంకు చెందిన భువనేశ్వరి, కడపజిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డిలకు మూడుసంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక చిన్న పాప కూడా ఉంది. శ్రీకాంత్ పనిపాటా లేకుండా తిరుగుతూ ఉండేవాడు. భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. జీతం లక్ష రూపాయలు.
 
భార్య జీతంతోనే జీవనం సాగుతూ ఉండేది. మొదట్లో వీరు బాగానే ఉన్నా ఆ తరువాత డబ్బుల కోసం శ్రీకాంత్ రెడ్డి భార్యను హింసించేవాడు. తరచూ మద్యం కోసం డబ్బులు అడుగుతూ ఉండడంతో ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవి. అయితే సరిగ్గా ఐదురోజులక్రితం తిరుపతికి వచ్చారు భార్యాభర్తలు.
 
భార్యను అతి కిరాతకంగా చంపేసిన శ్రీకాంత్ రెడ్డి ఒక సూట్ కేసులో పడుకోబెట్టేశాడు. ఆ తరువాత రుయా ఆసుపత్రి మెడిసిన్ వార్డు వెనుక ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొచ్చాడు. మద్యం సేవించి ఆ మత్తులో కిరోసిన్ పోసి సూట్ కేసుతో పాటు భార్యను తగులబెట్టేశాడు. దీంతో కాలిబూడిదైంది మహిళ మృతదేహం.
 
అయితే రెండురోజుల తరువాత వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. గుర్తు తెలియని మృతదేహంగా భావించి మొదట్లో విచారణ జరిపారు. ఆ మృతదేహం మహిళదిగా నిర్థారించుకుని పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు.
 
దర్యాప్తులో భర్త ఫోన్‌ను ట్రాక్ చేశారు. భర్త పరారీలో ఉండడంతో అనుమానంతో ఆసుపత్రిలోకి వచ్చిన కార్లకు సంబంధించిన వివరాలను సిసి ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది. ట్యాక్సీ డ్రైవర్ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బృందం వెళ్ళింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.