శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (07:56 IST)

ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ శాఖ  చకచకా కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు  వలంటీర్లు అందించిన సమాచారాన్ని విశ్లేషించి ఇప్పటికే 22.78 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసింది.

నవరత్నాల అమల్లో భాగంగా వచ్చే ఉగాది రోజు 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను సాకారం చేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నివాస స్థల పట్టాలు ఇవ్వడానికి భూమిని సమకూర్చుడం మహా యజ్ఞంలా మారింది.

అందువల్ల ఈ అంశపైనే రెవెన్యూ శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22,850 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలు ఇవ్వడానికి గుర్తించిన భూమి పోనూ ఇంకా 19 వేల ఎకరాలు అవసరమని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. ఈ భూసేకరణ నిమిత్తం రూ.10 వేల కోట్లు అవసరమని రెవెన్యూ శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది.  
 
చకచకా  కసరత్తు :
నిధుల విడుదలకు సీఎం  సమ్మతి తెలపడంతో నివాస స్థలాల కోసం భూసేకరణ కసరత్తును రెవెన్యూ శాఖ వేగవంతం చేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో భూమి విలువ అధికంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్‌ త్రీ తరహాలో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి తర్వాత గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో భూముల కొరత, అధిక ధరలను పరిగణనలోకి తీసుకుని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం జీ ప్లస్‌ త్రీకి అనుమతించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరగా ప్రభుత్వం ఆమోదించింది. 

మూడు దశల్లో నిధుల విడుదలకు సీఎం ఆదేశం :
భూసేకరణకు రూ.10 వేల కోట్ల నిధులు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మౌఖికంగా నివేదించామని రెవెన్యూశాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. ‘రూ.3 వేల కోట్ల చొప్పన మూడు విడతల్లో రూ. 10 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. 

ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న భూమి పోనూ గ్రామీణ  ప్రాంతాల్లో 8000 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 11000 ఎకరాలు కలిపి మొత్తం 19000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వ్యయ నియంత్రణలో భాగంగా సాధ్యమైనంతవరకూ భూసేకరణను తగ్గించి ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నాం. ఇదే లక్ష్యంతో ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉంటే గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించాం’ అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వెల్లడించారు.