సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (21:09 IST)

రైల్వే ప్రాజెక్టుల భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాష్ట్రంలో చేపట్టిన వివిధ రైల్వై ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సకాలంలో భూసేకరణ చేసి రైల్వేకు అప్పగించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

మంగళవారం అమరావతి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపై సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నిటినీ సకాలంలో పూర్తి చేయాలని రైల్వే జియంను కోరారు.

రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన 17 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబి) నిర్మాణంలో అప్రోచ్ రోడ్డులకు సంబంధించిన వ్యయం రాష్ట్రం ప్రభుత్వం భరించాలని గతంలోనే హామీ ఇచ్చినందున ఆవ్యయాన్ని భరించడం జరుగుతుందని ప్రస్తుత రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల దష్ట్యా ఇక భవిష్యత్తులో నిర్మించే ఆర్ఓబిల అప్రోచ్ రోడ్ల నిర్మాణ వ్యవయాన్ని రైల్వేశాఖే భరించాలని అన్నారు.

మంజూరైన రైల్వే ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ చేయకుండా ఆయా భూముల ఖర్చులు అధికం కావడంతో పాటు ఆయా ప్రాజెక్టుల వ్యయం కూడా అధికం అవుతుందని చెప్పారు.కావున రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సకాలంలో భూసేకరణ చేసి అప్పగించడం జరుగుతుందని సిఎస్ సుబ్రహ్మణ్యం పునరుద్ఘాటించారు. 

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతిలోని తిరుపతి రైల్వే స్టేషన్ ను అన్నివిధాలా ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అందుకు తగిన ప్రణాళికను రూపొందించి సత్వర చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రైల్వే జియంను కోరారు.

దేశ నలుమూల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తిరుపతి వస్తుంటారని అక్కడ రైల్వే స్టేషన్లో మెరుగైన మరుగుదొడ్లు, క్లోక్ రూమ్లు, విశ్రాంతి గదులు,రెస్టారెంట్లు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు.

ఇందుకు సంబంధించి స్టేషన్ విస్తరణకై అక్కడ గల రెండు సత్రాలను ఖాళీచేయించి రైల్వేకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్, టిటిడి అధికారులను సిఎస్ ఆదేశించారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై మున్సిపల్, ఆర్అండ్బి, టిటిడి, రైల్వే శాఖల అధికారులు వెంటనే పరిశీలన చేసి ఒక నివేదిక సిద్ధంచేసి సమర్పించాలని చెప్పారు. 
   
దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ... రాష్ట్రంలో దక్షిణ మధ్యరైల్వే పరిధిలో కొనసాగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. ముఖ్యంగా  నడికుడి-శ్రీకాళహస్తి లైను,విజయవాడ-గుంటూరు వయా అమరావతి నూతన రైలు మార్గం ఏర్పాటు,విజయవాడ-భీమవరం-నర్సాపురం,భీమవరం-నిడదవోలు,గుడివాడ-మచిలీపట్నం డబుల్ లైన్ నిర్మాణం,విద్యుదీకరణ పనుల ప్రగతిని వివరించారు.

అదేవిధంగా విజయవాడ-ఖాజీపేట మూడవ లైను నిర్మాణం,దువ్వాడ-విజయవాడ మూడవలైను నిర్మాణం తదితర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను వివరించారు.వివిధ రైల్వే ప్రాజెక్టులకు ఇంకా చేయాల్సిన భూసేకరణను త్వరగా పూర్తిచేసి ఇవ్వాలని జియం గజానన్ మాల్య సిఎస్ కు విజ్ణప్తి చేశారు.

సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మన్మోహన్ సింగ్,నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి యంటి.కృష్ణ బాబు,మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, టిటిడి సంయుక్త ఇఓ బసంత్ కుమార్,గుంతకల్ డివిజన్ డిఆర్ యం పి.శ్రీనివాస్, విజయవాడ అదనపు డిఆర్ యం ఎంవిఎస్ రామరాజు, సిఇ రమణారెడ్డి, సిఏఓ అజయ్ అగర్వాల్, ఇతర రైల్వే అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.