శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (19:17 IST)

డిపాజిట్లు సేకరించి మోసం చేస్తే వెంటనే చర్యలు : సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాష్ట్రంలో అక్రమ వడ్డీ వ్యాపారాలు, రిజిష్టర్ కాని బోగస్ చిట్ ఫండ్ కంపెనీల బారిన పడి ప్రజలు మోసపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన ఆర్బీఐ 16వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
 
 వడ్డీ వ్యాపారుల నుండి ప్రజలు మోసపోకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ దిశగా సంబంధిత నియంత్రణ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు వివిధ బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు లేదా ఇతర ఆర్ధిక సంస్థల్లో కుదువ పెట్టే ప్రతి పైసాకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వివిధ చిట్ ఫండ్ కంపెనీలు ప్రజల నుండి డబ్బు వసూలు చేసి వారి సొమ్ములు తిరిగి చెల్లించకుండా మోసం చేస్తున్న సంఘటలను మనం నిత్యం చూస్తున్నామని అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్రాలకు చెందిన శాఖలు, ఏజెన్సీలు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 
 
ఎక్కడైనా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్టు ఫిర్యాదులు లేదా వార్తలు వచ్చినా వెంటనే విచారణ జరిపి ఆయా సంస్థలపై సకాలంలో చర్యలు తీసుకునే విధంగా సంబంధిత శాఖలు సన్నద్ధమై ఉండాలని సీఎస్ స్పష్టం చేశారు. సమాజంలో న్యాయబద్దమైన వ్యాపారం జరగాలని, అక్రమ ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిరంతర పర్యవేక్షణ ఉంచడంతోపాటు ప్రజలను కూడా అలాంటి సంస్థల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండేలా పెద్దఎత్తున అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు.
 
రెండు మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ మరింత అర్ధవంతంగా నిర్వహించి అక్రమాలకు పాల్పడివారిపై సకాలంలో చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికతో రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. వచ్చే సెప్టెంబరులో నిర్వహించే తదుపరి సమావేశానికి సంబంధిత శాఖలు పూర్తి కార్యాచరణతో రావాలని చెప్పారు. అంతేగాక ఎక్కడైనా చిట్ ఫండ్ మోసాలు లేదా ఆర్ధిక సంస్థలు డిపాజిట్లు సేకరించి ప్రజలను మోసగించినట్టు ఫిర్యాదులు వస్తే సంబంధిత కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సత్వరం స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సుబ్రహ్మణ్యం చెప్పారు.
 
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ బ్యాంకింగ్ యేతర ఆర్ధిక కార్యకలాపాల మోసాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అటు కేంద్రం, ఇటు రాష్ట్ర శాఖలపై ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర శాఖలు, ఏజెన్సీలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
 
సిఐడి అదనపు డిజి అమిత్ గార్గ్ మాట్లాడుతూ.... అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ తదితర సంస్థలకు సంబంధించిన కేసులు వాటి పురోగతి తదితర వివరాలను తెలియజేశారు. సమావేశంలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేంద్ర కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజితో పాటు వివిధ శాఖల అధికారులు, సెబి, ఆర్ఓసి, ఎంసిఏ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు.