శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:41 IST)

రైతు సాయంపైనా టీడీపీ ఏడుపే? ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతాంగం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంటే టీడీపీ నేతలకు బాధెందుకు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ రైతుభరోసా పథకం గురించి బడ్జెట్‌ పుస్తకంలోని అంశాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చదివి వినిపించారు.

‘‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో రూ.12,500లు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాము. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థికస్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వటం జరిగింది. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయనుకున్న నిబద్ధత ప్రకారం 15 అక్టోబర్‌ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులు అందరికీ సమకూర్చాలని నిర్ణయించారు.

అంటే ఒక సంవత్సరం ముందే ప్రవేశపెట్టా’’మని బుగ్గన చదివి వినిపించారు. దీనికి రూ.8,750 కోట్ల పెట్టుబడి వ్యయంతో వైయస్‌ఆర్‌ భరోసా పథకం వల్ల 64,06,000 రైతులు లబ్ధి పొందుతున్నారని, ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు కూడా ఉన్నారని బుగ్గన వివరించారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతుల్ని అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పటానికి గర్వపడుతున్నానని బుగ్గన అన్నారు. 
 
ధరల స్థిరీకరణ నిధి కోసం యావత్‌ భారతదేశంలో రూ.2,000 కోట్లు కేటాయింపులు చేస్తే  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు కేటాయించామని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. విపత్తులకు రూ.2,000 కోట్లు కేటాయించటం జరిగింది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు 4,525 కోట్లు కేటాయించటం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం రూ.2,500 కోట్లు నామమాత్రంగా కేటాయించి రూ.1,250 కోట్లు మాత్రమే సబ్సిడీలకు ఖర్చు పెట్టిందని బుగ్గన తెలిపారు.

బీమాకు ఖర్చు పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికీ అలవాటు  చేయాలని రైతులు కట్టాల్సిన భాగం కూడా ప్రభుత్వమే కడుతోందని బుగ్గన అన్నారు. 16 లక్షల కౌలు రైతుల కోసం ఈరోజు, రేపటిలో చట్టం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 11నెలల పంట హక్కు వచ్చేలా, భూయాజమాన్యాలకు భద్రత కల్పించేలా, అదేవిధంగా బ్యాంకులకు పోతే సులభంగా అప్పు పుట్టేలా, బీమా వచ్చేలా చట్టం తీసుకువస్తున్నామని అన్నారు. 
 
గత ప్రభుత్వం రుణమాఫీపై ప్రచారం చేసుకున్నారని, బాబు వస్తే బ్యాంకుల్లో బంగారం ఇంటికి వస్తుందని అన్నారు. ఈ  ప్రకటనలు నమ్మి రైతులు మోసపోయారని బుగ్గన వివరించారు. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీని కమిటీలు వేసి రూ.24,000 కోట్లకు కుదించారని బుగ్గన వివరించారు. అదీనూ రూ.1,50,000 మాత్రమేనని అదీ నాలుగు విడతలు అని షరతులు పెట్టారన్నారు. 
 
 
 
గత ప్రభుత్వం 24,000 కోట్ల రైతు రుణమాఫీకి ఐదేళ్లలో కేవలం రూ.16,500 కోట్లు కేటాయింపులు చేసి రూ.15,279 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని బుగ్గన ఎద్దేవా చేశారు. 
 
నీరు–చెట్టు పథకానికి రూ.793 కోట్లు కేటాయించి రూ.4850 కోట్లు ఖర్చు పెట్టారని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిబట్టే టీడీపీ నేతల దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతోందని బుగ్గన అంకెలతో సహా వివరించారు. టీడీపీ నేతలు రుణమాఫీ పథకానికి సరైన కేటాయింపులు కూడా చేయలేదని నీరు–చెట్టు పథకానికి కేటాయింపులు కన్నా భారీగా ఖర్చు చేశారని అన్నారు. 
 
నీరు–చెట్టు, చంద్రన్న బాట వీటి అన్నింటికీ కేంద్ర నిధులే అని బుగ్గన అన్నారు. వాటికి పేర్లు ఏమో చంద్రబాబువి పెట్టారన్నారు. ఇక, రెయిన్‌గన్స్‌ పేరుతో పంటలు పండుతున్నాయని చెప్పారు.  ఆ రెయిన్‌గన్స్‌ ఎక్కడకు పోయాయో తెలీదు కానీ పైపులు మాత్రం టీడీపీ కార్యకర్తల ఇంట్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు. 
 
మరోవైపు– అమ్మ ఒడి పథకంపైన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించగా మేనిఫెస్టోలో ఆ పథకంపై 5వ తరగతి విద్యార్థి కూడా అర్థం చేసుకునేలా సులభమైన పదాలతో రూపొందించామని బుగ్గన తెలిపారు.