గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (12:53 IST)

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. మూడు రోజుల పండుగకు అంతా సిద్ధం

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 1న నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 
 
ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించున్నారు. దీనితోపాటు స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మానించనున్నారు.
 
సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ది చెందిన వంటకాలను ప్రజలకు అందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 
 
కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, విజయవాడకు చెందిన లెదర్‌ ఐటమ్స్, నర్సాపురంకు చెందిన లేస్‌ అల్లికలు, మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, విజయవాడ, ఒంగోలుకు చెందిన చెక్క బొమ్మలు, తిరపతి, చిత్తూరు, గన్నవరంకు చెందిన జౌళి వస్తువులకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు.
 
రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింభించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.