బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 17 జులై 2021 (11:39 IST)

విజయవాడలో వృద్ధురాలి కిడ్నాప్‌... ఎవ‌రామె? ఎందుకిలా?

విజయవాడలో వృద్ధురాలి కిడ్నాప్‌ కలకలం రేపింది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి రాత్రి సమయంలో నారాయణపురంలోని పెట్రోల్‌ బంకు ప్రాంతంలో ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కారులో తీసుకెళుతుండగా... 'రక్షించండి.. ర‌క్షించండి' అంటూ ఆ వృద్ధురాలు కేకలు పెట్టింది. వృద్ధురాలి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కంట్రోల్‌ రూమ్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. అస‌లింత‌కీ ఆ వృద్ధురాలు ఎవ‌రు? ఎందుకిలా బ‌ల‌వంతంగా ఆమెను కారు ఎక్కించారు? అనేది మిస్ట‌రీగా మారింది. స్థానికంగా ఉన్న నారాయ‌ణ‌పురం కాల‌నీ నుంచే ఆమెను బ‌ల‌వంతంగా కారు ఎక్కించి తీసుకు వెళ్ళార‌ని తెలుస్తోంది.

అయితే, కాల‌నీవాసులు మాత్రం ఈ విషయంలో త‌మ‌కు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. చాలా మంది త‌మ‌కు అరుపులు వినిపించాయ‌ని చెపుతున్నారు. కానీ, ఆ వృద్ధురాలి స‌మ‌చారం మాత్రం ఎవ‌రూ చెప్ప‌డం లేదు. దీనితో పోలీసులు ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.